Reading Time: < 1 minute

అర్హులైన ఏ ఒక్కరి ఓటునూ పోనివ్వం!..రాష్ట్రంలో 2 నెలలపాటు ఓటు పరిరక్షణ ఉద్యమం : పీసీసీ చీఫ్ మహేశ్‌‌‌‌ గౌడ్ వెల్లడి

Caption of Image.

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో అర్హులైన ఏ ఒక్కరి ఓటునూ చేజారనివ్వబోమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఓట్లు గల్లంతైన బాధితులను ఏకం చేసి.. ఓటర్ల హక్కుల పరిరక్షణకు ఉద్యమం చేస్తామని వెల్లడించారు. ఈ దిశలో రాష్ట్రంలో రాబోయే 2 నెలలపాటు ఓటు పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అక్రమాలపై కూడా కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్నారు.

‘సర్’ ప్రక్రియలో అవకతవకలు, ఓట్ల తొలగింపుపై సోమవారం ఇందిరా భవన్‌లో జరిగిన కాంగ్రెస్ అగ్రనేతల సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌‌గౌడ్ పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగిందని చెప్పారు.‘సర్’ అక్రమాలపై రానున్న రెండు నెలలపాటు నిరంతరం కార్యక్రమాలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే, అర్హత కలిగిన ప్రతి ఓటరు హక్కును కాపాడుతామన్నారు.

ఈ లక్ష్యంతో  గ్రామస్థాయి నుంచి పీసీసీ స్థాయి వరకు ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రధానంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌‌కు వ్యతిరేకంగా ధర్నాలు, ర్యాలీలు  నిర్వహిస్తామన్నారు. మోదీ, అమిత్ షా ఒత్తిడితో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  ‘సర్’ ప్రక్రియలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో 92 లక్షల ఓట్లు గాయబ్‌

‘సర్’ పేరిట తెలంగాణలో దాదాపు 92 లక్షల ఓట్లు తొలగించారని మహేశ్‌గౌడ్‌ ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేశారన్నారు. ఆయన సూచనల మేరకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు.   మంగళ, బుధవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్థాయి నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, పీసీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. అలాగే,  అక్టోబర్ 8న ‘ఛలో రాజ్‌భవన్’ కార్యక్రమం ఉంటుందన్నారు.

©️ VIL Media Pvt Ltd.