Reading Time: < 1 minute
రూ.500 నోటుపై అభ్యంతరకర వీడియో.. చిక్కుల్లో కంటెంట్ క్రియేటర్ సిమ్రాన్‌ పటేల్‌!

సూరత్‌: మహాత్మా గాంధీ చిత్రమున్న రూ.500 కరెన్సీ నోటును అభ్యంతరకర రీతిలో చూపిస్తూ సోషల్ మీడియాలో రీల్‌ పోస్ట్ చేసిన ఓ కంటెంట్‌ క్రియేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన 47 ఏళ్ల సిమ్రాన్‌ పటేల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

సూరత్‌లోని అడాజన్‌ ప్రాంతంలో నివసించే ఆమె.. గాంధీ జయంతికి ముందు రోజు అక్టోబర్‌ 1న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల మధ్య తన సోషల్‌ మీడియా ఖాతాల్లో ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రీల్‌లో మహాత్మా గాంధీ చిత్రమున్న కరెన్సీ నోటుకు సంబంధించి అనుచిత దృశ్యాలు, హావభావాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.

సూరత్‌ పోలీసులు తమ అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా అరెస్టు విషయాన్ని వెల్లడించారు. అరెస్టుకు ముందు, అనంతరం తీసిన వీడియో క్లిప్‌లను కూడా షేర్‌ చేశారు. అనంతరం పటేల్‌ ఆన్‌లైన్‌లో వీడియో పోస్ట్ చేసినందుకు క్షమాపణలు కోరినట్లు పోలీసు వీడియోలో కనిపించింది. సామాజిక కార్యకర్త ధర్మేష్‌ గామి ఈ రీల్‌పై సూరత్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఎలక్ట్రానిక్‌ రూపంలో అశ్లీల కంటెంట్‌ను ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్‌ 67 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సామాజిక అశాంతికి దారితీసే అవకాశం ఉన్న కంటెంట్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. పటేల్‌ 17 ఏళ్ల క్రితం వివాహం అనంతరం సూరత్‌లో స్థిరపడ్డారు. 12వ తరగతి వరకు చదువుకున్నారని పోలీసులు తెలిపారు. ఆమె తరచూ సోషల్‌ మీడియాలో షార్ట్‌ వీడియోలు రూపొందించి పోస్ట్‌ చేస్తుంటారని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..