Reading Time: 2 minutes

ఎల్‌నినో ఎఫెక్ట్.. మంచి నీళ్ల సరఫరాలో 10 శాతం కోత : మహారాష్ట్రలో ఎల్ నినో హాహాకారాలు

Caption of Image.

ఎల్‌నినో ప్రభావంతో దేశంలో వర్షాభావ పరిస్థితులు తీవ్రం కావడంతో జలాశయాలు, డ్యాముల్లో నీటిమట్టాలు పడిపోతున్నాయి. సాగునీటి కొరత ఇప్పటికే పంటలపై ప్రభావం చూపుతుండగా.. దేశం రబీ సీజన్‌లోకి అడుగుపెడుతున్న కొద్దీ రైతులపై ఒత్తిడి మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం ఇబ్బందులు మొదలయ్యాయి. వానాకాలం ముగిసిన తర్వాత రాబోయే నెలల్లో అసలు నీటి పరీక్ష ఎదురుకానుందా?..

ఎల్ నినో ఎఫెక్ట్  దేశంలో పలు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.  వర్షాభావ పరిస్థితులతో జలాశయాలు అడుగంటుతున్నాయి. దీంతో అటు రైతులు, ప్రజలు తాగు, సాగునీటికోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా  తగినంత వర్షాలు పడకపోవడంతో రాష్ట్రంలోని రిజర్వాయర్లు, భూగర్భ జల మట్టాలు తగ్గాయి. తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈసారి చలి తీవ్రత తగ్గి, సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 

మహారాష్ట్రలో రుతుపవన వర్షపాతం లోటు, కరువు లాంటి పరిస్థితి తలెత్తే ప్రమాదం పెరుగుతున్న క్రమంలో అక్టోబర్ 16 నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 10 శాతం నీటి కోతను అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

మరో వైపు పొరుగు రాష్ట్రమైన గుజరాత్‌లో వర్షాభావ పరిస్థితులలో రైతులు, ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటుండగా,  కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని వేల కోట్ల రూపాయల కరువు సహాయాన్ని కోరింది. బలహీనమైన, అస్తవ్యస్తమైన రుతుపవనాలు నీటి సంక్షోభానికి ఎలా దారితీయగలవో ఈ పరిణామాలు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నాయి. దీనికి తోడు, అభివృద్ధి చెందుతున్న ఎల్ నినో మరింత అనిశ్చితిని జోడిస్తోంది.

ఎల్ నినో ప్రభావం, కరువు లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, 2027 ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై ప్రభుత్వం డ్యామ్‌ల వారీగా, రంగాల వారీగా ప్రణాళికను చేపట్టిందని మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు , గ్రామ పంచాయతీలతో పది శాతం నీటి సరఫరాలో కోత విధించాలని ఆదేశించారు. త్రాగునీరు, పశువులు, పశుగ్రాసం అవసరాలు తీరిన తర్వాతే సాగునీటి విడుదల చేయాలని సూచించారు.

ALSO READ : ఉపాధి పేరిట ఏజెంట్ మోసం.

దేశం రబీ సీజన్‌లోకి ప్రవేశిస్తున్న కొద్దీ, రైతులకు పరిణామాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.  రబీలో ఆహార ధాన్యాలు, పశుగ్రాసం కోసం ఉన్న జలవనరుల వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చారు. 

ఎల్‌నినో ప్రభావం, బలహీనమైన రుతుపవనాలు రానున్న రోజుల్లో నీటి సంక్షోభం మరింత తీవ్రం కానున్నదని సూచిస్తున్నాయి. వర్షాకాలం ముగిసిన తర్వాతే జలాశయాల్లో నీటి నిల్వలు ఎంత కీలకమో స్పష్టమవుతోంది. తాగునీరు, సాగునీరు, పశువుల అవసరాలను తీర్చడం ప్రభుత్వాలకు పెద్ద సవాల్‌గా మారనుంది. ముఖ్యంగా రబీ సీజన్‌లో నీటి లభ్యత తగ్గితే రైతులపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు కేవలం ఒక సీజన్‌కు సంబంధించిన సమస్యగా కాకుండా.. రాబోయే నెలల్లో దేశ నీటి భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.