
ఇల్లెందు: ప్రేమించి పెళ్లాడిన భార్య పుట్టిన రోజు.. చాలా కాలం తర్వాత తన ఇంటికి వస్తుందని ఆశపడ్డాడు.. బర్త్ డే సెలబ్రేషన్స్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆమె కోసం కళ్లుకాయలు కాసేలా చాలా సేపు ఎదురు చూశాడు.. కానీ.. ఆమె తిరిగి వస్తుందన్న ఆశ నిరాశగా మారడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన తీవ్ర విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో చోటుచేసుకుంది. ఇల్లెందు సీఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:
వివరాల్లోకి వెళ్తే:
ఇల్లెందు మండలం తిలక్‌నగర్ పంచాయతీ పరిధిలోని కల్తీరామయ్య గుంపునకు చెందిన దాట్ల విద్యాసాగర్ (26) మణుగూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి మూడేళ్ల క్రితం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చెందిన ఓ యువతితో ప్రేమ వివాహం జరిగింది. కొంత కాలం అంతా బాగానే ఉంది. అయితే.. ఊరు నుంచి వెళ్లి.. మణుగూరులో నివాసమున్న ఈ దంపతులు.. ఆరునెలల క్రితం ఇల్లెందుకి వచ్చారు. ఇక్కడే నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే.. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు, విభేదాలు తలెత్తడంతో భార్య భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె ఖమ్మంలోని ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది.
ఆశగా ఎదురుచూసి నిరాశతో..
అయితే.. సోమవారం భార్య పుట్టినరోజు కావడంతో విద్యాసాగర్ ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాడు. భార్య వస్తుందనే ఆశతో ఇల్లెందు బస్టాండ్‌లో చాలాసేపు వేచిచూశాడు. ఎంతకీ ఆమె రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యాసాగర్.. దారుణ నిర్ణయం తీసుకున్నాడు. సోమవారం అర్ధరాత్రి తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పాడ్డాడు.
గమనించిన కుటుంబసభ్యులు వెంటనే విద్యాసాగర్‌ను ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.