Reading Time: < 1 minute

 రూ.50 వేలు డిపాజిట్ చేస్తే  రోజుకు 5 డాలర్లు ..సూర్యాపేటలో  ట్రేడింగ్ పేరుతోగ్రామీణ ప్రజలకు టోకరా

Caption of Image.

సూర్యాపేట: జిల్లాలోని నూతనకల్ మండలంలో ట్రేడింగ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్–QVSE’ పేరుతో సైబర్ నేరస్తులు గ్రామీణ ప్రాంత ప్రజలను టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

యాప్‌లో సభ్యత్వం పొందేందుకు రూ.50 వేల డిపాజిట్ చేయాలని, అందుకు ప్రతిరోజూ ఐదు డాలర్ల చొప్పున చెల్లింపులు చేస్తామని నమ్మించారు. అంతేకాకుండా కొత్తగా ఒక్కో సభ్యుడిని చేర్పిస్తే రూ.7,500 కమిషన్ ఇస్తామని ఆశ చూపించారు.

కమిషన్లకు ఆశపడిన కొందరు మధ్యవర్తులు పెద్ద సంఖ్యలో కొత్త సభ్యులను ఈ స్కీమ్‌లో చేర్పించారు.  తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వస్తుందన్న ప్రచారంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ యాప్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. నిందితుల మాటలు నమ్మి సుమారు 110 మంది బాధితులు పెట్టుబడులు పెట్టారు.  ఒక్క నూతనకల్ గ్రామం నుంచే సుమారు రూ.30 లక్షలు సైబర్ నేరస్తుల ఖాతాల్లోకి వెళ్లినట్లు సమాచారం.

ప్రారంభంలో చెల్లింపులు, కమిషన్ల పేరుతో నమ్మకం కల్పించి.. ఆ తర్వాత పెట్టుబడిదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ప్రజలు అధిక రాబడి, తక్కువ పెట్టుబడి అంటూ వచ్చే ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తెలియని యాప్‌లు, వ్యక్తులు లేదా సంస్థలకు డబ్బులు బదిలీ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

సైబర్ నేరస్తుల వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సంస్థ, యాప్ వివరాలను పూర్తిగా పరిశీలించాలని, అనుమానాస్పద లావాదేవీలకు దూరంగా ఉండాలని సూచించారు.

 

©️ VIL Media Pvt Ltd.