
న్యూఢిల్లీ: సర్ ప్రక్రియలో అవకతకవలు, ఫారమ్ 6లో మార్పులు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష తీరుపై ఆరోపణలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వడంపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ.. ఫారమ్ 6లో మార్పులకు ఎటువంటి ఆమోదం తెలపలేదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ఫైర్ అయ్యారు.
‘‘జ్ఞానేష్ కుమార్ ఫారం 6ను చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా మార్చారన్నది ఇప్పుడు నిస్సందేహంగా రుజువైంది. బీజేపీకి సహాయం చేయడానికి అతను తన పదవిని దుర్వినియోగం చేస్తున్నాడనడానికి ఇది మరో రుజువు మాత్రమే. మన ప్రజాస్వామ్యంపై జరిగిన ఈ నేరపూరిత దాడిలో పాలుపంచుకున్న జ్ఞానేష్తో పాటు ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉంటారు’’ అని రాహుల్ హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.
ఈసీ, కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
సర్ ప్రక్రియలో అవకతకవలు, ఫారమ్ 6లో మార్పులు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై ఆయనను పదవి నుంచి తొలగించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. అక్టోబర్ 5న ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంఘంలో మిగిలిన ఇద్దరు కమిషనర్ల ఆమోదం లేకుండా సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
అంతేకాకుండా, ఫామ్ 6 మార్పులకు తాము ఎటువంటి ఆమోదం తెలపలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫామ్ 6లో మార్పులు ఎవరు చేశారో రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. దేశంలోవ కోట్ల సంఖ్యలో ఓటర్లను తొలగించారన్న ఆరోపణల వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.