
- సీనియర్ల లాబీయింగ్.. ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు
- ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకు ఢిల్లీలోనే పలువురు మకాం
హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 14తో గవర్నర్ కోటాలోని మూడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానుండటంతో కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ పదవీకాలం ముగియనుండగా.. వారి స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.
అసెంబ్లీలో కాంగ్రెస్‌కు తగినంత బలం ఉండటంతో ఈ మూడు స్థానాలు ఆ పార్టీకి దక్కే చాన్స్ఉంది. ఇందులో ఒక సీటును పద్మశాలి సామాజిక వర్గానికి ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల సిరిసిల్ల సభలో ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబంలో ఒకరికి అవకాశం దక్కే సూచనలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, నల్గొండ, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు కైలాస్ నేత, సంగీతం శ్రీనివాస్, కుడా చైర్మన్ గుండు సుధారాణి, తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దూడం వెంకటరమణ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
బీసీలకు రెండు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ హామీ ఇవ్వడంతో పలువురు ఆశావహులు రేసులోకి వచ్చారు. సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహిళా కోటాలో ఇందిరా శోభన్ కూడా ప్రయత్నిస్తున్నారు. యాదవ వర్గం నుంచి ఖమ్మం జిల్లాకు చెందిన లోకేశ్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీశ్ పోటీలో ఉన్నారు.
మైనార్టీ కోటాలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బ్రాహ్మణ కోటాలో మరో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఎస్సీ కోటాలో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎస్టీ కోటాలో బెల్లయ్య నాయక్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీల్లో వెనుకబడిన కులాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మరోసారి అవకాశం ఇవ్వాలని హైకమాండ్‌ను కోరుతున్నారు.
దసరా, దీపావళి తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పలువురు ఆశావహులు ఢిల్లీలో మకాం వేసి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారం వరకు ఈ ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది.