
భారత వైమానిక దళానికి కొత్త అధిపతిగా ఆశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. భారత వైమానిక దళానికి 29వ అధిపతిగా ఎంపికయ్యారు. పదవీ విరమణ చేయనున్న ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ స్థానంలో అక్టోబర్ 31 మధ్యాహ్నం ఆశుతోష్ దీక్షిత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆశుతోష్ దీక్షిత్ భారత వైమానిక దళంలో ప్రస్తుతం వైస్ చీఫ్‌గా పనిచేస్తున్న ఆయనకు దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సేవా అనుభవం ఉంది. 1986 డిసెంబర్ 6న భారత వైమానిక దళంలోని ఫైటర్ స్ట్రీమ్‌లో నియమితులయ్యారు.
1966 డిసెంబర్ 9న జన్మించిన ఆశుతోష్ దీక్షిత్.. ఎక్స్‌పెరిమెంటల్ టెస్ట్ పైలట్, క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు. వివిధ రకాల యుద్ధ విమానాలు, ఇతర విమానాలపై ఆయనకు 3,500 గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం ఉంది. మిరాజ్-2000, మిగ్ సిరీస్ విమానాలు, కిరణ్, జాగ్వార్, IL-78, హాక్, తేజస్ తదితర విమానాలను ఆయన నడిపారు. ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ సిందూర్ వంటి కీలక ఆపరేషన్లలో కూడా ఆయనకు అనుభవం ఉంది.
దీక్షిత్ తన కెరీర్‌లో పలు కీలక కమాండ్ బాధ్యతలు నిర్వహించారు. మిరాజ్-2000 స్క్వాడ్రన్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేయడంతో పాటు.. పశ్చిమ సెక్టార్‌లోని ఫ్రంట్‌లైన్ ఫైటర్ ఎయిర్‌బేస్, దక్షిణ సెక్టార్‌లోని ఫైటర్ ట్రైనింగ్ బేస్‌కు కూడా నాయకత్వం వహించారు. అలాగే సదరన్ ఎయిర్ కమాండ్‌లో ఎయిర్ డిఫెన్స్ కమాండర్‌గా, సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో డిప్యూటీ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ బాధ్యతలు కూడా నిర్వహించారు.
వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆశుతోష్ దీక్షిత్ సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. అనంతరం చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌కు చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2026 జూలై 1న ఆయన వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.
దేశీయ రక్షణ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో.. భారతదేశ స్వదేశీ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) తేజస్ సహా పలు విమాన ప్రాజెక్టులతో దీక్షిత్‌కు అనుభవం ఉంది. ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ రిక్వైర్‌మెంట్స్, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ప్రాజెక్ట్స్), అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ప్లాన్స్) వంటి కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ పదవుల్లో విధాన రూపకల్పన, ప్రణాళిక, ప్రాజెక్టులు, వైమానిక సామర్థ్యాల అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పనిచేశారు.
ఆశుతోష్ దీక్షిత్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పూర్వ విద్యార్థి. బంగ్లాదేశ్‌లోని స్టాఫ్ కోర్స్, న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో కూడా శిక్షణ పొందారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2006లో వాయుసేన మెడల్, 2011లో విశిష్ట సేవా మెడల్, 2023లో అతి విశిష్ట సేవా మెడల్, 2026లో పరమ విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు.
ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అక్టోబర్ 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. అదే రోజు మధ్యాహ్నం ఆశుతోష్ దీక్షిత్ భారత వైమానిక దళం అధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో దాదాపు నాలుగు దశాబ్దాల ఫైటర్ పైలట్ అనుభవం ఉన్న అధికారి చేతుల్లో భారత వైమానిక దళానికి కొత్త నాయకత్వం రానుంది.