Reading Time: 2 minutes

మునగాలలో భారీ కమ్యూనిటీ కిచెన్.. 60 వేల మంది స్టూడెంట్స్ కు బ్రేక్ ఫాస్ట్ అందించేలా నిర్మాణం..

Caption of Image.
  • రూ.9.60 కోట్ల ఎస్​సీసీఎల్, సీఎస్ఆర్ నిధులు, హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
  • అక్టోబర్‌‌‌‌ 6న శంకుస్థాపన చేయనున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి

మునగాల/హుజూర్ నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లాలోని 1,029 ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న సుమారు 60 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మునగాల మండలం సయ్యద్ ముజావర్ పేట వద్ద అత్యాధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌‌‌‌ ఏర్పాటు చేయనున్నారు. 

హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, సీఎస్​ఆర్ నిధుల నుంచి రూ.9.60 కోట్లు కేటాయించింది. విద్యార్థులకు ఒకే కేంద్రంలో ఆహారం తయారు చేసి, ప్యాకింగ్‌‌‌‌, రవాణా, పంపిణీ చేసే విధంగా ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఈనెల 6న మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

రెండు జిల్లాల విద్యార్థులకు ప్రయోజనం

మునగాల మండలంలో నిర్మిస్తున్న కమ్యూనిటీ కిచెన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల స్టూడెంట్లకు ఇక్కడి నుంచే అల్పాహారం సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లాలోని 60 వేల మంది విద్యార్థులతో పాటు నల్గొండ జిల్లాలోని నకిరేకల్, శాలిగౌరారం, కేతేపల్లి, వేములపల్లి తదితర మండలాల్లోని 131 విద్యాసంస్థలకు చెందిన సుమారు 7,972 మంది విద్యార్థులకు కూడా ఈ కిచెన్ నుంచే బ్రేక్ ఫాస్ట్ సప్లై చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించడమే ప్రధాన లక్ష్యంగా కమ్యూనిటీ కిచెన్‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. 

100 రోజుల్లో అందుబాటులోకి..

కమ్యూనిటీ కిచెన్ నిర్మాణ పనులను స్పీడ్ గా చేసి 100 రోజుల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కిచెన్‌‌ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆహార తయారీ, ప్యాకింగ్, రవాణా తదితర ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశంలోనే ప్రత్యేకంగా నిలిచేలా ఈ కమ్యూనిటీ కిచెన్ ను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి చెప్పారు.

రేపు శంకుస్థాపన

మునగాల మండలంలో నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌‌‌‌కు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి హాజరుకానున్నారు. కిచెన్‌‌‌‌ నిర్మాణం, నిర్వహణ, ఆహార తయారీ, విద్యాసంస్థలకు సరఫరా వంటి అంశాలను మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షిస్తానని మంత్రి తెలిపారు. 
 

©️ VIL Media Pvt Ltd.