
- బ్లాక్ స్పాట్లకు శాశ్వత ఇంజినీరింగ్ పరిష్కారాలు చూపాలి
- డిజైన్ నుంచి నిర్వహణ వరకు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
- గుజరాత్ చింతన్ శివిర్‌లో మంత్రి వ్యాఖ్యలు
హైదరాబాద్, వెలుగు: సురక్షిత రహదారుల నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగాలని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించేందుకు సమష్టి కృషి అవసరమన్నారు. మంగళవారం గుజరాత్‌లో జరుగుతున్న చింతన్ శివిర్-2026 రెండో రోజు ‘సురక్షిత రహదారుల రూపకల్పన-ప్రమాణాల నుంచి అమలు వరకు’ సెషన్‌కు మంత్రి అధ్యక్షత వహించి మాట్లాడారు.
రహదారి భద్రతకు ప్రమాణాలు రూపొందించడం మాత్రమే సరిపోదని, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసి సురక్షిత రహదారులు అందించడమే లక్ష్యమన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించడంతో ఆగకుండా శాశ్వత ఇంజినీరింగ్ పరిష్కారాలు చూపాలని, డిజైన్ నుంచి నిర్వహణ వరకు ప్రతి దశలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. రోడ్డు భద్రత ఆడిట్లను నిరంతరం కొనసాగించాలని సూచించారు.
దేశంలో రోడ్డు ప్రమాద మరణాలు ఆందోళనకరం..
2023లో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 1,72,890 మంది చనిపోయారని మంత్రి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో 23,652, తమిళనాడులో 18,347, మహారాష్ట్రలో 15,366, మధ్యప్రదేశ్‌లో 13,798, కర్నాటకలో 12,321 మంది మరణించారని చెప్పారు. తెలంగాణలో 7,660 మంది ప్రాణాలు కోల్పోయారని, దేశవ్యాప్త మరణాల్లో ఇది 4.4 శాతమన్నారు. మొదటి పది రాష్ట్రాల్లోనే దాదాపు 74 శాతం ప్రమాద మరణాలు నమోదవుతున్నాయని తెలిపారు.
హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్-65పై ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 17 బ్లాక్ స్పాట్లు గుర్తించి ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్నా.. నాలుగు లేన్ల రహదారిపై ట్రాఫిక్ లోడ్ పెరిగిందన్నారు. 6+2 లేన్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రహదారి విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఆస్ట్రేలియా తరహా విధానం భేష్..
అమెరికా, యూకే, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలు రహదారి డిజైన్, వాహన భద్రత, వేగ నియంత్రణ, కఠిన అమలు, పాదచారులు-సైక్లిస్టుల భద్రతతో ప్రమాద మరణాలను తగ్గించగలిగాయని తెలిపారు. ఆస్ట్రేలియా ‘సేఫ్ సిస్టమ్’ విధానాన్ని భారత పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయవచ్చన్నారు.