
అమరావతిని అత్యాధునిక, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి) నుంచి కీలక సహకారం లభించింది. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన UN-హ్యాబిటాట్ సంస్థ, రాయపూడిలోని సీఆర్డీఏ (APCRDA) ప్రధాన కార్యాలయంలో అర్బన్ ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ (URBIS) కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమక్షంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, యునైటెడ్ నేషన్స్ ప్రతినిధులు ఈ ఒప్పంద పత్రాలను అధికారికంగా మార్చుకున్నారు.
రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా ప్రభుత్వ విభాగాలు .. జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కలిసి ఈ URBIS కేంద్రం పనిచేయనుంది. అమరావతి నిర్మాణ ప్రక్రియలో ఈ కేంద్రం అత్యంత కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా హౌసింగ్ నిర్మాణాలు, మురికివాడల అభివృద్ధి, సమగ్ర పట్టణ ప్రణాళిక రూపకల్పన, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యూహాలు రచించడం, అలాగే ప్రజలకు మరింత మెరుగైన, సమర్థవంతమైన పట్టణ సేవలను అందించడంలో ఈ వేదిక సేవలు అమూల్యమైనవిగా మారనున్నాయి.
ఈ ఒప్పందంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ హ్యాబిటాట్ బృందం అమరావతిలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పర్యటనలో భాగంగా అధికారుల బృందానికి డిజిటల్ ట్విన్ టెక్నాలజీ ద్వారా అమరావతి అభివృద్ధి తీరును వివరించారు. మాస్టర్ ప్లాన్ విశేషాలు, కీలక మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ సముదాయాల నిర్మాణాలు, నగరంలో గల పెట్టుబడి అవకాశాలను యునైటెడ్ నేషన్స్ ప్రతినిధులకు సమగ్రంగా ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేశారు. పట్టణ మౌలిక సదుపాయాలు, పర్యావరణహిత సుస్థిర అభివృద్ధి ప్రణాళికలపై ఈ బృందం ప్రత్యేక దృష్టి సారించనుంది.
అమరావతిని గ్లోబల్ సిటీగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం మరింత ఊపునిస్తుందని భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులోకి రావడం ద్వారా రాజధాని నిర్మాణం మరింత వేగవంతం కానుంది. ఈ కేంద్రం ఏర్పాటుతో అమరావతి భవిష్యత్తులో ఆధునిక సాంకేతికతకు, సుస్థిర నగర ప్రణాళికలకు నిలయంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.