Reading Time: 2 minutes

ప్రమోషన్లకు డబ్బులు లేవు.. పెళ్లి పత్రికలతో ప్రచారం.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ప్రేమద ఊరల్లి’!

Caption of Image.

చిన్న సినిమా అయినా సరే కంటెంట్ ఉంటే చాలు.. స్టార్ హీరో అవసరం లేదు. భారీ బడ్జెట్అంతకన్న అవసరమే లేదు. ప్రమోషన్లకు కోట్లు కుమ్మరించాల్సిన పనిలేదు. కథ నచ్చితే ప్రేక్షకులే సినిమాకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారితే బాక్సాఫీస్ ఎలా బద్దలవుతుందో అని నిరూపిస్తోంది ‘ప్రేమద ఊరల్లి’  (Premada Ooralli) చిత్రం. స్టార్ హీరోల చిత్రాలకు గట్టి పోటీ ఇస్తూ.. కన్నడనాట థియేటర్లలో దూసుకెళ్తోంది 

సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన యశ్ టాక్సిక్ లాంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడి చేతులు కాల్చుకున్న వేళ.. కేవలం రూ. 2. 50 కోట్లతో ఈ  ‘ప్రేమద ఊరల్లి’ తెరకెక్కించారు. ఈ  కన్నడ రొమాంటిక్ డ్రామా ఇప్పుడు సినీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తొలి రోజు ఈ మూవీ కేవలం రూ. 9 లక్షల కలెక్షన్లతో , 60 షోలతో మొదలైంది. 

ప్రేక్షకుల మౌత్ టాక్ పవర్ తో 10వ రోజు ఏకంగా రూ. 3.5 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటి వరకూ రూ. 20 కోట్లకు పైగా రాబట్టింది. అంటే పెట్టిన పెట్టుబడికి దాదాపు ఏడు రెట్ల వసూళ్లు చేసింది.  లవ్ మాక్ టైల్ 3, కారావళి రికార్డులను సవాల్ చేస్తూ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో  మోస్ట్ ప్రాఫిటబుల్ ప్రాజెక్టు గా నిలిచింది. ఈ  కన్నడ రొమాంటిక్ డ్రామా రోజు రోజుకు షోలు, కలెక్షన్లను పెంచుకుంటూ రికార్డులు సృష్టిస్తోంది.

ఈ చిత్రాన్ని  ‘అక్షి ‘ ఫేమ్ , జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు మనోజ్ కుమార్ తెరకెక్కించారు. అయితే ఈ రెండో సినిమా ప్రమోషన్‌కి రూపాయి బడ్జెట్ లేక పెళ్లి పిలుపు పత్రికల్లాంటి కార్డులను ప్రింట్ చేయించి, బస్సులు, రైళ్లు తిరుగుతూ చేతులెత్తి దండం పెట్టి ‘మా సినిమాను చూడండి’ అని ప్రచారం చేసుకున్నారు. షూటింగ్ చివరి రోజైతే వర్షం సీన్ తీయడానికి డబ్బులు లేక.. “రేపు నీ తాళి బొట్టు కుదువబెట్టు తల్లి” అని మనోజ్ కన్నీళ్లతో అమ్మకు కాల్ చేయగా.. అది విన్న హీరోయిన్ తపస్విని పూణచ్చ ఏడుస్తూ సింగిల్ టేక్‌‌లో షాట్ ఓకే చేసి ఆ తాళిని కాపాడింది..

ఆ నిజాయితీనే ఈరోజు ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తోంది.   అంతే కాదు  బెంగళూరులో సోమవారం కూడా పలు షోలు హౌస్‌ఫుల్ కావడం సినిమాకు వస్తున్న క్రేజ్‌కు అద్దం పడుతోంది. యూట్యూబ్‌లో “ఏరు పేరు హృదయ” పాట 4.5 మిలియన్ల వ్యూస్‌తో నెట్టింట ట్రెండ్ అవుతోంది.  ఈ చిత్రంలో రంగాయణ రఘు, శ్రీరామ్, తపస్విని పూనచ్చ, రమిక శివు నటించారు.  బలమైన కథే అసలైన కలెక్షన్ల సునామీ అని ‘ప్రేమద ఊరల్లి’ చాటి చెబుతోంది.

©️ VIL Media Pvt Ltd.