
నిమ్స్ ఆసుపత్రికి రోగుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఓపీ, ఇన్‌పేషెంట్ సేవలతో పాటు వివిధ వైద్య పరీక్షలు (ఇన్వెస్టిగేషన్స్) చేయించుకునేందుకు వచ్చే రోగుల సంఖ్యలోనూ భారీగా పెరుగుదల నమోదవుతోంది.
గతంలో నిమ్స్‌లో రోజుకు సుమారు 3 వేల 500 మంది ఓపీ రోగులు వస్తుండగా, ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటీవల ఒకే రోజులో అత్యధికంగా 5 వేల635 మంది ఓపీ రోగులు వైద్య సేవలు పొందారు.
అదేవిధంగా, ఇన్వెస్టిగేషన్స్ విభాగంలోనూ రోగుల తాకిడి పెరిగింది. ఒకే రోజులో అత్యధికంగా 5 వేల 88 మంది రోగులు వివిధ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే, ఒకే రోజులో 306 మంది రోగులు ఇన్‌పేషెంట్ విభాగంలో చికిత్స కోసం చేరినట్లు ఆసుపత్రి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఎమర్జెన్సీ విభాగంలోనూ రోగుల తాకిడి గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకు సుమారు 50 మంది రోగులు ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స కోసం అడ్మిట్ అయ్యేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య రోజుకు 80 నుంచి 90 మందికి పెరిగింది.
పెరుగుతున్న ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీతో పాటు డయాగ్నస్టిక్ సేవలకు నిమ్స్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోంది. అత్యాధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండటంతో నిమ్స్‌కు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
గతంలో ఓపీ రిజిస్ట్రేషన్ సేవల సమయం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఉండగా, ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ రిజిస్ట్రేషన్ సేవలను పొడిగించారు. అలాగే, వివిధ వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను అదే రోజు అందిస్తుండటం కూడా రోగులకు సౌకర్యంగా మారింది. ఓపీ రిజిస్ట్రేషన్ సమయం పెంచడం, ఇన్వెస్టిగేషన్ రిపోర్టులను త్వరగా అందించడం వంటి అంశాలు కూడా రోగుల సంఖ్య పెరగడానికి కారణమై ఉండొచ్చని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.