Reading Time: < 1 minute

సుప్రీంకోర్టుకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్.. రాష్ట్రపతి ఉత్తర్వులు

Caption of Image.

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయనతో పాటు మరో ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 

సుప్రీంకోర్టు కొలీజియం సెప్టెంబర్ 28న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌తో పాటు గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయలను సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించాలని సిఫారసు చేసింది. తాజాగా కేంద్రం ఈ నియామకాలను అధికారికంగా నోటిఫై చేసింది. 

జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ 1965 జూలై 7న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఆయన 1990లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. తొలుత పాట్నా హైకోర్టులో, అనంతరం జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2012లో జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2014లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2023 ఏప్రిల్‌లో త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, కేంద్ర ప్రభుత్వం బదిలీ ఉత్తర్వుల అనంతరం 2025 జూలై 19న తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా  జస్టిస్ శ్యామ్ కోశాయి వ్యవహరించనున్నారు. 

©️ VIL Media Pvt Ltd.