
లుసానే: ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే దిశగా ఇండియా మరో అడుగు ముందుకేసింది. 2036 మెగా గేమ్స్‌కు సంబంధించిన ఇండియా, ఖతార్‌తో పాటు మరో ఐదు దేశాలు రేసులో ఉన్నాయని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) మంగళవారం వెల్లడించింది. వచ్చే నెలలో ఐవోసీ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్‌కు క్రీడల ప్రాజెక్ట్‌ను సమర్పించేందుకు ఆయా దేశాలను ఆహ్వానించినట్లు తెలిపింది. వేదికల మాస్టర్ ప్లాన్, అథ్లెట్ల అనుభవం, నిధుల సమీకరణ వ్యూహం, రాజకీయ, ప్రజా మద్దతు, క్రీడల నిర్వహణ సామర్థ్యాలు, ఆతిథ్య దేశాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే వారసత్వ వ్యూహం వంటి అనేక సాంకేతిక అంశాల ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ను అంచనా వేయనున్నారు.
వందకు పైగా దేశాల సభ్యులు కలిగిన ఐవోసీ.. 2029లో ఓటింగ్ ద్వారా ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేస్తుంది. ఇందులో ఇండియా, ఖతార్ ఫేవరెట్లుగా ఉన్నట్లు ఐవోసీ వర్గాలు వెల్లడించాయి. జర్మనీ, హంగేరి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సౌతాఫ్రికా, టర్కీ కూడా రేసులో ఉన్నాయి. బిడ్డింగ్‌కు అక్టోబర్ 31 చివరి తేదీ. అహ్మదాబాద్ కేంద్రంగా మెగా గేమ్స్‌ను నిర్వహించేందుకు 2024లోనే ఇండియా ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ను దాఖలు చేసింది.