
- బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
సైఫాబాద్, వెలుగు: జాతీయ జనగణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చాలన్న డిమాండ్‌పై ఈ నెల 8లోగా రాజకీయ పార్టీల అధ్యక్షులు తమ వైఖరిని స్పష్టం చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. స్పందించని రాజకీయ పార్టీలను బీసీలు బొందపెట్టాలని పిలుపునిచ్చారు. ఓబీసీ కాలమ్‌పై స్పష్టమైన వైఖరి వెల్లడించకపోతే, ఆయా పార్టీల బీసీ వ్యతిరేక చిట్టాను ప్రజల ముందుంచుతామని హెచ్చరించారు. సైఫాబాద్‌లోని బీసీ జేఏసీ ఆఫీస్‌లో ఢిల్లీలో ఈ నెల 8న నిర్వహించనున్న జాతీయ అఖిల పక్ష సమావేశానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను బీసీ నేతలతో కలిసి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ జనగణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చాలని డిమాండ్ చేస్తూ రెండు నెలలుగా దేశవ్యాప్తంగా బీసీలు ఆందోళనలు చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరైంది కాదన్నారు.
బీసీ కులగణన చేపట్టకుండా బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీగా చరిత్రలో నిలిచిపోతుందని, అదేవిధంగా బీసీ కులగణన కోసం డిమాండ్ చేయని ఇతర రాజకీయ పార్టీలు కూడా బీసీ ద్రోహుల పార్టీలుగా మిగిలిపోతాయని హెచ్చరించారు. ఓబీసీ కాలమ్‌పై దేశంలోని అన్ని రాజకీయ పార్టీల వైఖరిని తెలుసుకునేందుకు ఈ నెల 8న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో జాతీయ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకొని ఓబీసీ కాలమ్ సాధన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి, వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, నేతలు ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, తాటికొండ విక్రమ్‌గౌడ్, కనకాల శ్యాం కుర్మ, జాజుల లింగంగౌడ్, వల్లబోజు నరసింహచారి, ఇంద్రం, బండిగారి రాజు గౌడ్, సంపత్ పాల్గొన్నారు.