
ఇంట్లోనే కుండీలలో లేదా గ్రో బ్యాగ్‌లలో పసుపు మొక్కను సులభంగా పెంచుకోవచ్చు. మన వంటగదిలోని పసుపు కొమ్ములను ఉపయోగించే ఆర్గానిక్ పసుపును నాటుకోవచ్చు. దీని కోసం మంచి నీటి పారుదల సౌకర్యం ఉన్న 10-12 అంగుళాల లోతైన కుండీని ఎంచుకోవాలి. మొలకలు వచ్చిన పసుపు కొమ్ములను మట్టిలో రెండు అంగుళాల లోతులో నాటి, క్రమం తప్పకుండా నీరు పారించాలి. 7 నుండి 9 నెలల్లో పసుపు పంట చేతికి వస్తుంది. ఇంట్లోనే రసాయనాలు లేని స్వచ్ఛమైన పసుపును పొందడానికి ఇది అద్భుతమైన మార్గం.
సరైన కుండీ ఎంపిక:
పసుపు కొమ్ములు మట్టిలో లోపలికి వ్యాపిస్తాయి. కాబట్టి, కనీసం 10 నుండి 12 అంగుళాల లోతు, వెడల్పు ఉన్న కుండీలు లేదా గ్రో బ్యాగ్‌లను ఎంచుకోవాలి. కుండీ అడుగుభాగంలో అదనపు నీరు బయటకు పోవడానికి ఖచ్చితంగా డ్రైనేజీ రంధ్రాలు ఉండాలి. పసుపు మొక్క లూజ్ గా, పోషకాలతో కూడిన మట్టిలో బాగా పెరుగుతుంది. దీని కోసం 40శాతం సాధారణ తోట మట్టి. 30శాతం వర్మీకంపోస్ట్ లేదా బాగా ఎండిన పశువుల ఎరువు. 30శాతం కొబ్బరి పొట్టు, కొద్దిగా ఇసుక కలిపి మట్టి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి.
వంటగదిలో ఉండే పసుపు కొమ్ములలో మొలకలు వచ్చిన వాటిని ఎంచుకోవాలి. సిద్ధం చేసుకున్న కుండీ మట్టిలో 2 నుండి 3 అంగుళాల లోతులో ఈ కొమ్ములను మొలకలు పైకి ఉండేలా నాటాలి. అనంతరం తేలికగా నీరు చల్లాలి. పసుపు మొక్కకు రోజుకు కనీసం 4 నుండి 5 గంటల పాక్షిక సూర్యకాంతి అవసరం. మట్టి ఎల్లప్పుడూ తేమగా ఉండాలి. కానీ, కుండీలో నీరు నిల్వ ఉండకూడదు. నీరు ఎక్కువైతే కొమ్ములు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.
పసుపు పంట సిద్ధమవ్వడానికి సుమారు 7 నుండి 9 నెలల సమయం పడుతుంది. మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోవడం ప్రారంభించినప్పుడు పసుపు కొమ్ములు కోతకు సిద్ధమయ్యాయని గుర్తించాలి. అప్పుడు కుండీలోని మట్టిని మెల్లగా తొలగించి స్వచ్ఛమైన పసుపు కొమ్ములను సేకరించవచ్చు. ఈ చిన్నపాటి చిట్కాలతో ఎలాంటి రసాయనాలు లేని తాజా, ఆరోగ్యకరమైన పసుపును మీ ఇంట్లోనే పండించుకోండి.