
టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఊహించని షాకిచ్చింది. అక్టోబర్ 8, 2026 నుంచి దేశవ్యాప్తంగా కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్ల ద్వారా వినియోగదారులపై నెలకు రూ.50 అదనపు భారం పడనుంది. ప్రస్తుత పోస్ట్‌పెయిడ్ సబ్‌స్క్రైబర్లను రాబోయే నెల రోజుల్లోగా వారి ప్లాన్లకు సమీపంలోని అత్యధిక ప్లాన్‌కు ఆటోమేటిక్‌గా మైగ్రేట్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ధరల పెంపుతో పాటు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎయిర్‌టెల్ ఇందులో కొన్ని ఆకర్షణీయమైన ప్రయోజనాలను కూడా యాడ్ చేసింది. ప్రతి పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌కు సంవత్సరానికి ఒకసారి ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్ ట్రిప్ ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఉచిత రోమింగ్ ప్యాక్ విలువ దాదాపు రూ.2వేల వరకు ఉంటుందట. ప్రత్యేకించి ఫ్యామిలీ ప్లాన్‌లను వాడుతున్న కస్టమర్ల విషయంలో ప్రతి ఒక్క సభ్యుడు ఈ ఉచిత రోమింగ్ సౌకర్యాన్ని పొందేందుకు అర్హులని స్పష్టం చేశారు.
ఈ కాంప్లిమెంటరీ రోమింగ్ ప్యాక్ ద్వారా వినియోగదారులకు 5జీబీ డేటా, 60 నిమిషాల టాక్‌టైమ్, 25 అవుట్‌గోయింగ్ ఎస్‌ఎంఎస్‌లతో పాటు ఉచిత ఇన్‌కమింగ్ ఎస్‌ఎంఎస్‌లు లభించనున్నాయి. ఈ ప్యాక్ 5 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. కస్టమర్‌లు తమ విదేశీ ప్రయాణ సమయానికి అనుగుణంగా ఎప్పుడైనా ఈ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ధరల పెంపుతో పాటు ఫాస్ట్ లేన్ టెక్నాలజీ, అన్‍లిమిటెడ్ డేటా, స్పామ్ అండ్ ఫ్రాడ్యులెంట్ లింక్స్ నుంచి నెట్‌వర్క్ స్థాయి రక్షణ వంటి భద్రతా ఫీచర్లు కూడా లభించనున్నాయి.
ఇవే కాకుండా ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ అడ్వాంటేజ్ క్లబ్ ద్వారా సబ్‌స్క్రిప్షన్‌లు, కామెడీ షోలు, సినిమా ప్రీమియర్లు, ప్రత్యేక కన్సర్ట్‌లకు యాక్సెస్ లభిస్తుందని ఎయిర్‌టెల్ తమ ప్రకటనలో పేర్కొంది. టారిఫ్‌లు పెరగడం వల్ల సామాన్య, మధ్యతరగతి పోస్ట్‌పెయిడ్ కస్టమర్లపై కొద్దిగా ఆర్థిక భారం పడినప్పటికీ.. విదేశీ ప్రయాణాలు చేసేవారికి మాత్రం కొంత ఊరటనిచ్చేలా ఉంది. టెలికాం రంగంలో పోటీ పెరుగుతున్న వేళ ఎయిర్‌టెల్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం మార్కెట్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.