
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారని ‘ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్’ (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా అన్నారు. అలాగే అరెస్ట్ అయిన వారిలో ‘రోసీ’ అనే జర్నలిస్ట్ కూడా ఉన్నారు. మా లీగల్ టీమ్ వారితో మాట్లాడుతోందని, స్థానికంగా ఉన్న న్యాయవాదులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చి సహాయం చేయాలని ఆమె ‘X’ (ట్విట్టర్)లో కోరారు.
అసలేం జరిగిందంటే
అక్టోబర్ 3న న్యూఢిల్లీలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో కొందరు పోలీసు అధికారులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. అందులో రోసీ ఒకరు. ప్రస్తుతం ఈ ఫిర్యాదుపై విచారణ కోసం కేసును కమలా మార్కెట్‌లోని క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.
TMC మద్దతు
అక్టోబర్ 10లోగ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA) లేదా ఇతర కఠిన చట్టాల కింద మా నాయకులను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ డెరెక్ ఓ’బ్రియన్ స్పందిస్తూ CJPకి పూర్తి మద్దతు ప్రకటించారు. “మీకు మేము ఎల్లప్పుడూ తోడుగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి” అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
►ALSO READ | టీచర్ల కొరతపై ప్రశ్నించిన ఎమ్మెల్యేపై ఆప్ వేటు..పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని బహిష్కరణ
భయపడేది లేదు – CJP వ్యవస్థాపకుడు
ఈ పరిణామాలపై CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందిస్తూ… UAPA, NSA వంటి తీవ్రమైన చట్టాలు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించినంత మాత్రాన మేము భయపడి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం జైల్లో ఉండేందుకైనా సిద్ధమేనని, మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలోనే శాంతియుతంగా పోరాడతామని ఆయన తెలిపారు.
నిరసన ఎందుకంటే?:
ఎలక్షన్ కమిషన్ చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా సీజేపీ ఈ నిరసనలు చేపడుతోంది. దీనిపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, అక్టోబర్ 10న ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చారు.