Reading Time: 2 minutes
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. పోలీస్ గ్రెనేడ్ పేలి 15 ఏళ్ల బాలుడి చేయి ఛిద్రం

విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఇప్పటివరకు 6,100 మందిని అరెస్టు చేసినట్లు ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. వీరిలో 1,483 మంది మైనర్లు ఉన్నారు. ఆందోళనలు మొదలైనప్పటి నుంచి 215 మంది విద్యార్థులు, 715 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. చాలా ప్రాంతాల్లో నిరసనలు ప్రశాంతంగా జరిగినప్పటికీ.. కొన్ని చోట్ల విద్యార్థులు వస్తువులు విసరడం, చెత్త డబ్బాలకు నిప్పు పెట్టడం, రోడ్లను అడ్డుకోవడం చేసారు. పోలీసులు టియర్‌ గ్యాస్‌, లాఠీలు, అల్లర్ల నియంత్రణ పరికరాలతో నిరసనలను చెదరగొట్టారు.

15 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయం

ఆందోళనల్లో సోమవారం జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉత్తర ఫ్రాన్స్‌లోని లెన్స్‌ నగరంలో 15 ఏళ్ల విద్యార్థి తీవ్రంగా గాయపడి తన చేతిని కోల్పోయాడు. పోలీసులు నిరసన నియంత్రణకు ఉపయోగించే గ్రెనేడ్‌ను ఆ బాలుడు చేతుల్లోకి తీసుకున్న సమయంలో అది పేలింది. ఈ ఘటనతో పోలీసుల చర్యలపై విమర్శలు మరింత పెరిగాయి. మైనర్లపై అవసరానికి మించిన బలాన్ని పోలీసులు ఉపయోగిస్తున్నారని నిరసనకారులు, హక్కుల సంఘాలు ఆరోపించాయి. పోలీసుల దురుసు ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్‌ నునెజ్‌ దర్యాప్తుకు ఆదేశించారు.  అయితే నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయని, వాటిని అదుపు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాల్సి వస్తోందని ప్రభుత్వం వాదిస్తోంది.

అసలు విద్యార్థుల డిమాండ్లు ఏంటి?

విద్యార్థులు ప్రధానంగా స్కూళ్లలో మౌలిక వసతులను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తరగతి గదుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉండటం, ఉపాధ్యాయుల కొరత, గైర్హాజరైన టీచర్ల స్థానంలో ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులు లేకపోవడం, పాతబడిన, సరిగ్గా నిర్వహించని స్కూల్‌ భవనాలు, డెస్కులు, కుర్చీల కొరత, ఎక్కువ గంటల పాటు తరగతులు నిర్వహించడం, వేసవిలో తరగతి గదులు విపరీతంగా వేడెక్కడం, కొన్ని పాఠశాలల్లో ఎలుకల సమస్యను పరిష్కరించి తమకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని కోరుతున్నారు. దేశవ్యాప్తంగా మంగళవారం జరిగిన నిరసనల్లో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కార్మిక సంఘాల కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణలు జరగకుండా పెద్దలు మానవహారంగా నిలిచి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ప్రభుత్వం ఏం చేస్తోంది?

విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఫ్రాన్స్‌ ప్రధానమంత్రి సెబాస్టియన్‌ లెకోర్ను హామీ ఇచ్చారు. గైర్హాజరైన ఉపాధ్యాయుల స్థానంలో ప్రత్యామ్నాయ టీచర్లను నియమించడం, స్కూల్‌ భవనాల మరమ్మతులు, పాఠశాల సమయాలపై సమీక్షల పై ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రులను ఆదేశించారు. అక్టోబర్‌ చివరి నాటికి తొలి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. అయితే విద్యార్థులు మాత్రం కేవలం హామీలు కాకుండా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్‌లో పారిస్‌ శివార్లలో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్త నిరసనగా మారడంతో ఫ్రెంచ్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.