
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 7 జిల్లాల్లో రెవెన్యూ, సర్వే, హౌసింగ్, రిజిస్ట్రేషన్ శాఖలపై సమీక్షలు నిర్వహించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిర్మల్ పర్యటనలో భాగంగా మంత్రి భూ సర్వేపై కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 120 ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో భూ సర్వే జరిగిందని, మళ్లీ ఇప్పుడు అత్యంత ఆధునిక పద్ధతిలో మూడు విడతల్లో భూ సర్వే చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుతం మొదటి విడత సర్వే కొనసాగుతోందన్నారు. ఆర్థిక భారం ఎక్కువగా అయినప్పటికీ ప్రజల భవిష్యత్తు కోసం ఈ సర్వే ఎంతో కీలకమని, ఏడాదిన్నర లోపే దీనిని పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. ప్రతి భూమికి ఎల్‌పీఎం నంబర్ కేటాయించి, భవిష్యత్‌లో ‘భూదార్’ పేరుతో పక్కా పాస్ పుస్తకాలు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గిరిజనులు, గిరిజనేతరులకు సంబంధించిన భూ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్రస్థాయిలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇక రాష్ట్రంలో గృహనిర్మాణ రంగంపై మాట్లాడిన ఆయన, ఇప్పటికే ప్రజా ప్రభుత్వం తరఫున 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, మొత్తం మీద రాష్ట్రంలో ఇప్పటివరకు 8 లక్షల ఇళ్లు ఇచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో సర్వే ప్రకారం 73 వేల ఇళ్లు, గుడిసెలు ఉన్నట్లు గుర్తించామని, అర్హులైన పేదలకు రెండో విడతలో ఇళ్ల స్థలాలు లేదా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
రాబోయే దసరా పండుగ నాటికి మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకునేలా సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణను పూర్తిగా భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఇప్పటికే మందలించామని హెచ్చరించారు.