
- ఖర్గే, రాహుల్ ఇచ్చిన ధైర్యంతోనే చెబుతున్నా: మహేశ్ గౌడ్
- బీసీలకు రావాల్సిన వాటా.. అవసరమైతే లాక్కుంటాం
- బీసీలకు సీఎం, డిప్యూటీ సీఎం అండగా ఉన్నారు
- పీసీసీ ఓబీసీ సెల్ మీటింగ్‌లో పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు
- దేశవ్యాప్తంగా కులగణన కోసం ప్రజా ఉద్యమం: మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతారని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీలకు రావాల్సిన వాటా తీసుకుంటామని.. అవసరమైతే లాక్కుంటామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన ధైర్యంతోనే ఈ మాట చెప్తున్నానని అన్నారు. బీసీలకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అండగా ఉంటారని చెప్పారు.
ఆదివారం శంషాబాద్‌లో ‘జాతీయ జనగణనలో ఓబీసీ కులగణన సాధన’ కోసం పీసీసీ ఓబీసీ సెల్ కన్వీనర్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ మీటింగ్‌కు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు సురేష్ షెట్కార్, మల్లు రవి, విప్ బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కీ, వంశీచంద్ రెడ్డితో పాటు పార్టీ నేతలు అటెండ్ అయ్యారు.
ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ..“ తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అవుతాడని ఘంటాపథంగా చెబుతున్నా. బీసీల హక్కుల కోసం మాట్లాడే ధైర్యం రాహుల్ గాంధీ ఇచ్చారు. ఎవరు ఎంతో, వారికి అంత అన్నది రాహుల్ భారత్ జోడో యాత్ర నినాదం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 55 శాతానికి పైగా బీసీ సర్పంచ్‌లను చేశాం.
మున్సిపల్ ఎన్నికల్లో 58 శాతం బీసీలకు సీట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మంత్రివర్గంలో, ఎమ్మెల్సీల్లో, కార్పొరేషన్లలో బీసీల సంఖ్యను పెంచుతాం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రుల సహకారంతో కుల సర్వే నిర్వహించి డాక్యుమెంట్ ఇచ్చాం”అని వివరించారు.
దేశవ్యాప్తంగా కులగణన చేయాలి: పొన్నం
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కులగణన సామాజిక న్యాయానికి పునాది అని అన్నారు. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని, దేశంలోని బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల హక్కులకు సంబంధించిన అంశమన్నారు. “సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కులగణన నిర్వహించి బిహార్‌తోపాటు దేశానికే ఆదర్శంగా నిలిచింది. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కులగణన కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి. సమావేశాలు, ప్రజా సభలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా కులగణన ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలు ఐక్యంగా నిలబడి సామాజిక న్యాయం కోసం పోరాడాలి. అనేక వెనుకబడిన వర్గాలకు ఇప్పటికీ తగిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి శాసనసభ, పార్లమెంట్ వరకు అన్ని స్థాయిల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి. తెలంగాణలో కులగణన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు శాసనసభ తీర్మానం చేసింది. కేబినెట్ నిర్ణయం తీసుకుని ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది”అని పొన్నం చెప్పారు.
కేంద్రంలో కాంగ్రెస్ రాగానే కుల సర్వే
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దగ్గరికి వెళ్ళి చెప్పే దమ్ము, ధైర్యం వారికి లేదన్నారు. కుల సర్వే సాకారం అయి ఉంటే యావత్తు దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా ఉండేదన్నారు. కేంద్ర సర్వేలో 10వ కాలమ్‌లో ఎస్సీ, ఎస్టీ ఇచ్చి ఓబీసీ కాలమ్ ఎత్తేశారని ఆయన ఫైర్ అయ్యారు. బీసీలను మోదీ మోసం చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ పిలుపు కేంద్రానికి కనువిప్పు కావాలని, మోదీ గద్దె దిగే టైం వచ్చిందన్నారు. రాహుల్ ప్రధాని కావడం తథ్యం అని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కుల సర్వే నిర్వహిస్తామని, కులాలను పక్కనపెట్టి బీసీలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలది న్యాయమైన కోరిక అని, వాటా వచ్చే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.