Reading Time: < 1 minute

హైవే వెంట జీడిమామిడి మొక్కలు..దేశంలోనే మొదటిసారిగా ఎన్ హెచ్765 డీజీ వెంట ప్లాంటేషన్

Caption of Image.
  • అక్టోబర్​ 6న  రామాయంపేట వద్ద ప్రారంభించనున్న గవర్నర్  

మెదక్/రామాయంపేట, వెలుగు : దేశంలోనే తొలిసారిగా మెదక్  జిల్లాలోని రామాయంపేట నుంచి సిద్దిపేట మధ్య ఎన్ హెచ్​765 డీజీ వెంట జీడి మామిడి మొక్కలు నాటనున్నారు. ఈ భారీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని మంగళవారం గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా రామాయంపేటలో ప్రారంభించనున్నారు. ఈ క్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ ప్రతిమా సింగ్​తెలిపారు.

 గవర్నర్ పర్యటనపై సోమవారం కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి 35 వేల జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని సాయంత్రం 3.30 గంటలకు స్వామి వివేకానంద విగ్రహం వద్ద ప్రారంభించనున్నట్లు చెప్పారు. జాతీయ రహదారి వెంట ఇంత భారీ స్థాయిలో ఒకేసారి జీడిమామిడి మొక్కలు నాటడం దేశంలోనే ఇదే తొలిసారన్నారు. 

జాతీయ రహదారి వెంట అందుబాటులో ఉన్న భూమిని ఉత్పాదకంగా వినియోగించుకోవడంతో పాటు పచ్చదనాన్ని, పర్యావరణాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన నషా ముక్త భారత్ ర్యాలీనిమెదక్ కలెక్టరేట్ లో ప్రారంభిస్తారని చెప్పారు.  

అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, ఐడీఓసీలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను సందర్శించి, స్వయం సహాయక సంఘాల సభ్యులతో గవర్నర్ భేటీ అవుతారని చెప్పారు. గవర్నర్​ పర్యటన సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.