Reading Time: < 1 minute
Ranbir Kapoor Ramayana Set Fire Incident

Ranbir Kapoor Ramayana: రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణం’ మొదటి భాగం విడుదలకు సిద్ధమవుతున్న సమయంలోనే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. షూటింగ్ సెట్‌లో ఒక పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. సెట్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడం అందరినీ కలవరపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన గురించి ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) ప్రతినిధులు వివరాలు వెల్లడించారు.

FWICE ప్రెసిడెంట్ బి.ఎన్. తివారీ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, స్టూడియో బయట వేసిన ఒక చిన్న టెంట్‌లో ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయని తెలిపారు. అయితే అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ఎవరూ గాయపడలేదని ఆయన చెప్పారు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే దగ్గర్లోని మరో ప్రాంతంలో ఇలాగే మంటలు చెలరేగడంతో, షూటింగ్ సెట్లలో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని నిర్మాతలకు సూచించామని, అయినా కూడా నిర్లక్ష్యం వల్ల మళ్లీ రామాయణం సెట్‌లో ఈ ఘటన జరిగిందని తివారీ అభిప్రాయపడ్డారు. ఈ సారికి పెద్ద నష్టమేమీ జరగకపోయినా, రాబోయే రోజుల్లో ప్రతి ప్రొడక్షన్ హౌస్ మరిన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది ఒక హెచ్చరికలాంటిదని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ బాలీవుడ్ సినిమా రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో దర్శకుడు కానీ, రణ్‌బీర్ కపూర్ కానీ అక్కడ ఉన్నారా లేదా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఇకపోతే, ఇటీవలే ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ ‘మిస్టర్ బీస్ట్’ ఈ సెట్‌ను సందర్శించి, సినిమా ప్రమోషన్లలో భాగమవడం ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను భారత్‌‌లో నవంబర్ 8న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5, 6 తేదీల్లో వేర్వేరు ప్రాంతాల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.