Reading Time: 2 minutes

ఎల్‌నినో ప్రభావంతో జలవిద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం: డిప్యూటీ సీఎం భట్టి

Caption of Image.

ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడిందని, వచ్చే ఏడాది జూన్, జూలై వరకు ఎల్‌నినో ప్రభావం ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క .. నీటి లభ్యత తగ్గడం వల్ల జలవిద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతోందన్నారు.

 సూర్యాపేట జిల్లా, చింతలపాలెం పులిచింతల ప్రాజెక్టులో నీటి లభ్యత, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి అవసరాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత నీటి పరిస్థితులు, భవిష్యత్ అవసరాలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..రాష్ట్రంలో రోజుకు సుమారు 20 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉందని, నీటి లభ్యత తగ్గడంతో జలవిద్యుత్ ద్వారా సుమారు 8 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో లేకుండా పోయిందని భట్టి విక్రమార్క వివరించారు. అయినప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

తాగునీటికి తొలి ప్రాధాన్యత

ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. మానవులు, జంతువుల జీవనానికి తాగునీరు అత్యవసరమని, తాగునీటి కొరత ఏర్పడితే ప్రజల జీవనం తీవ్రంగా ఇబ్బందులకు గురవుతుందని అన్నారు.

నీటి కొరత కారణంగా పంటల దిగుబడి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ప్రజలకు ఆహార ధాన్యాల కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. అవసరమైన ధాన్యాలను నిల్వ చేశామని చెప్పారు. నీటితో పాటు ఆహార ధాన్యాలను కూడా ప్రజలు పొదుపుగా వినియోగించుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు.

స్థానికులకు ఉద్యోగాలు.. గ్రామాల అభివృద్ధి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పులిచింతల ప్రాజెక్టును సందర్శించినట్లు తెలిపారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పారు.జెన్‌కోలో పనిచేస్తున్న ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. చుట్టుపక్కల గ్రామాలను సీఎస్‌ఐఆర్ ఫండ్స్ ద్వారా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.సామాజిక న్యాయం ప్రకారం ప్రాజెక్టు పరిసర గ్రామాలను అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని తెలిపారు.

ALSO READ : కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక అరెస్ట్.. 

పులిచింతల ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన స్థానికులకు ప్రాధాన్యత ఇస్తామని, స్థానిక యువతకు ప్రాజెక్టులో శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారిని కూడా పర్మినెంట్ చేసే అంశంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.నీటి కొరత నేపథ్యంలో ప్రాజెక్టుల్లో నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం వంటి కీలక రంగాలకు అవసరమైన ప్రణాళికలను ప్రభుత్వం అమలు చేయనున్నట్లు మంత్రులు వెల్లడించారు.

©️ VIL Media Pvt Ltd.