Reading Time: < 1 minute
Vizag Navy Sailor Arrested Pakistan Honey Trap Coimbatore

భారత నావికాదళానికి చెందిన అత్యంత సున్నితమైన రక్షణ రహస్యాలను పాకిస్తానీ గూఢచారికి చేరవేస్తున్నాడనే తీవ్ర ఆరోపణలతో విశాఖపట్నం ఈస్టర్న్ నావల్ కమాండ్‌కు చెందిన నేవీ అధికారి (సైలర్) అరెస్టయ్యాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 31 ఏళ్ల ప్రదీప్ ముఖర్జీ 2014లో భారత నౌకాదళంలో చేరి, ప్రస్తుతం వైజాగ్ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొద్ది నెలల క్రితం సోషల్ మీడియా వేదికగా ఒక పాకిస్తానీ మహిళా ఏజెంట్ ఇతనికి పరిచయమైంది. ఆ పరిచయాన్ని హనీట్రాప్‌గా మార్చుకున్న ఆ గూఢచారి, ప్రదీప్‌ను తన వలలో వేసుకుంది. ఈ క్రమంలోనే విశాఖ నావికా స్థావరానికి సంబంధించిన కీలక సమాచారం, యుద్ధనౌకల కదలికలు, నావికాదళ కార్యకలాపాల వివరాలను అతడు ఆ పాక్ ఏజెంట్‌కు చేరవేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.

ఐఎన్ఎస్ అగ్రాని వద్ద రంగంలోకి దిగిన కౌంటర్ ఇంటెలిజెన్స్

ఇటీవలే తమిళనాడులోని కోయంబత్తూరు రెడ్ ఫీల్డ్స్‌లో ఉన్న ఐఎన్ఎస్ అగ్రాని శిక్షణ కేంద్రానికి ప్రదీప్ ముఖర్జీ చేరుకున్నాడు. అక్కడ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ కోర్సులో శిక్షణ పొందుతుండగా, అతని డిజిటల్ కదలికలలో అనుమానాస్పద ఆనవాళ్లను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. పక్కా సమాచారంతో నిఘా పెంచిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు, నౌకాదళ ఉన్నతాధికారుల అనుమతితో కోయంబత్తూరులోని ఐఎన్ఎస్ అగ్రాని ప్రాంగణంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడకు తరలింపు.. లోతైన విచారణ

అరెస్టు అనంతరం నిందితుడిని స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పొందిన అధికారులు, తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అతడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. దేశ రక్షణకు సంబంధించిన ఎంతవరకు సమాచారం లీక్ అయింది, ఈ కుట్రలో ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించే అవకాశం ఉంది.