
నగరంలో ఆకతాయిల ఆగడాలు కలవరపెడుతున్నాయి. తాజాగా నలుగురు మైనర్లు ఒకే బైక్‌పై తిరుగుతూ.. చేతిలో తల్వార్‌తో హల్‌చల్ చేసిన ఘటన కలకలం రేపింది. కరీమాబాద్‌లోని వీరన్నగుడి ప్రాంతంలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చేతిలో తల్వార్‌తో హల్‌చల్
వీరన్నగుడి ప్రాంతంలో నలుగురు యువకులు ఒకే బైక్‌పై తిరుగుతూ హడావుడి చేసినట్లు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. వారిలో ఓ వ్యక్తి చేతిలో తల్వార్ పట్టుకుని ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. తమను చూసి మొరుగుతున్న వీధికుక్కలపై తల్వార్‌తో దాడికి యత్నించినట్లు వీడియోలో ఉన్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ఘటనపై పోలీసులు దృష్టి సారించి.. వీడియోలో కనిపిస్తున్న యువకులు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. వారు మైనర్లేనా? ఈ తరహా ఘటనలకు గతంలోనూ పాల్పడ్డారా? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
గతంలోనూ ఆకతాయిల వీరంగం
వరంగల్ నగరంలో ఆకతాయిలు, పోకిరీల దౌర్జన్యాలకు సంబంధించిన ఘటనలు గతంలోనూ వెలుగుచూశాయి. ఇటీవల ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న కొందరు యువకులను ఓ వ్యక్తి ప్రశ్నించడంతో.. అతడిపై నడిరోడ్డుపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. తాజాగా తల్వార్‌తో మైనర్లు హల్‌చల్ చేసిన ఘటన వెలుగులోకి రావడంతో నగరంలో యువత ప్రవర్తనపై మరోసారి చర్చ మొదలైంది.
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
శివనగర్, కరీమాబాద్, శాకరాసికుంట, శంభునిపేట, రంగశాయిపేట తదితర ప్రాంతాల్లో ఆకతాయిల వేధింపులు, హల్‌చల్‌పై పోలీసులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. మైనర్ల కదలికలపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. సరదా, జల్సాల పేరుతో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.