Reading Time: 2 minutes
ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిన 5 అంతస్థుల భవనం.. శిథిలాల కింద పలువురు.. అసలేం జరిగిందంటే..?

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఓ ఐదు అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. కళ్లముందే భారీ భవనం నేలమట్టం కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు, హాహాకారాలు చెలరేగాయి. భారీ ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. బుధవారం మధ్యాహ్నం సుమారు 3:15 గంటల సమయంలో భవనం కూలిపోయినట్లు ఫైర్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల తొలగింపు చర్యలను వేగవంతం చేశాయి. జిల్లా డీసీపీ ఆర్తి బీనా స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

శిథిలాల నుంచి నలుగురిని కాపాడిన స్థానికులు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం నలుగురిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే సమీపంలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే భవన యజమానితో పాటు ఒకే కుటుంబానికి చెందిన సుమారు ఆరుగురు వ్యక్తులు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద ఊపిరాడక అల్లాడుతున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు.

గతేడాదే పూర్తయిన నిర్మాణం.. నాణ్యతా లోపమే కారణమా?

ప్రమాదానికి గురైన భవనం కేవలం 25 చదరపు గజాల విస్తీర్ణంలోనే నిర్మించినట్లు ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో దుకాణాలు ఉండగా, పైన నాలుగు అంతస్తులను నివాసాల కోసం కేటాయించారు. ఈ భవన నిర్మాణం గతేడాదే పూర్తయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంత తక్కువ విస్తీర్ణంలో సరైన పునాదులు, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నాలుగు అంతస్తుల నిర్మాణం చేపట్టడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

ట్రాఫిక్ పోలీసుల కీలక హెచ్చరిక

భవనం కూలిన ఘటనతో ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేశారు. సీమాపురి రౌండ్‌అబౌట్, డీఎల్‌ఎఫ్ భోపురా, పరిసర మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. సహాయక చర్యలకు, అంబులెన్స్‌ల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఘటనా స్థలం వద్ద ప్రజలు గుమిగూడవద్దని, వాహనాలను రోడ్లపై నిలపవద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.