Reading Time: 2 minutes
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో రూ.లక్ష కోట్లతో భారీ ప్రాజెక్ట్.. 19వేల మందికి ఉపాధి!

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు ఎట్టకేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు లక్ష కోట్లతో ఈ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ ఏర్పాటు కానుంది. దేశంలోని మూడో అతిపెద్ద రిఫైనరీ సంస్థ అయిన బీపీసీఎల్ ఈ ప్రాజెక్టు ద్వారా తన ఉత్పత్తిని మరింత విస్తరించనుంది.

ఏటా 9 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పడబోతుంది. 2030 నాటికల్లా ఈ ప్రాజెక్టు పూర్తికానుంది. సుమారు 5,200 ఎకరాలలో 1,563 ఎకరాలు అంటే 30 శాతం గ్రీన్‌బెల్ట్‌గా అభివృద్ధి చేస్తారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం 6 వేల ఎకరాల భూమిని కేటాయించింది. 5.4 మిలియన్ టన్నుల రవాణా ఇంధనాలు పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ తో పాటు 3.2 మిలియన్ టన్నుల పెట్రోకెమికల్స్ పాలీప్రొపైలిన్, పీవీసీ, ఎల్‌డీపీఈ, ఫినాల్, అసిటోన్, అలాగే నాఫ్తా, ఎల్‌పీజీ, బిట్యూమెన్, ఫ్యూయల్ ఆయిల్, ప్రొపైలిన్ కూడా ఉత్పత్తి అవుతాయి.

ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,03,408 కోట్లు కాగా పర్యావరణ నిర్వహణ ప్రణాళికకు రూ.3,022 కోట్లు, పరిసర గ్రామాల్లో కార్పొరేట్ ఎన్విరాన్‌మెంట్ రెస్పాన్సిబిలిటీకి రూ.54 కోట్లు కేటాయించారు. నిర్మాణ దశలో ప్రత్యక్షంగా 400 మంది, పరోక్షంగా 13,600 మందికి, నిర్వహణ దశలో ప్రత్యక్షంగా 1,250 మంది, పరోక్షంగా 3,750 మందికి ఉపాధి లభించనుంది.

ఈ ప్రాజెక్టు కి రోజుకు 2,25,648 ఘనపు మీటర్ల మంచినీరు డీసాలినేషన్ ప్లాంట్ ద్వారా ఉపయోగించగా మొత్తం 770 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఇందులో 185 మెగావాట్లు క్యాప్టివ్, 585 మెగావాట్లు గ్రిడ్ నుంచి అందనుంది. ప్రాజెక్టు స్థలం చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణాలయాలు, బయోస్పియర్ రిజర్వ్‌లు లేవు. అయితే కొన్ని రిజర్వ్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్‌లు ఉన్నాయి. గత డిసెంబర్‌లో ఈ ప్రాంతంలో పబ్లిక్ హియరింగ్ జరిగింది. ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేవని ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) ఈఏసీకి తెలిపింది.

దీంతో పర్యావరణ అనుమతులకు లైన్ క్లియర్ అయ్యింది..ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ను ప్రాంతీయ ఇంధన కేంద్రంగా మార్చే ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ఉండనుంది. ఈ ప్రాజెక్టులో గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనాలు, మెరైన్ క్రూడ్ ఆయిల్ టెర్మినల్ కోసం ప్రత్యేక జోన్‌లు కూడా ఉంటాయి. బీపీసీఎల్ ప్రస్తుతం ముంబై, కొచ్చి, బీనా రిఫైనరీలను నడుపుతూ 35.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పనిచేస్తోంది. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా అధిక లాభాలు వచ్చే పెట్రోకెమికల్స్ వైపు మరింత దృష్టి సారించనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.