Reading Time: 2 minutes
Jailer 2 Trailer Review Surprise Twists And Rs 1000 Crore Box Office Buzz

Rajinikanth Jailer 2 RS 1000 Crore Box Office Buzz: ‘సూపర్‌ స్టార్’ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘జైలర్’. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘జైలర్ 2’ వస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జైలర్’ సాధించిన విజయంతో సీక్వెల్‌పై కూడా భారీ హైప్ ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా జైలర్ 2 ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజమూరి కీలక పాత్రల్లో నటించారు. బిగ్గెస్ట్ స్టార్స్ మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ ప్రత్యేక పాత్రల్లో మెరిశారు. ఈ భారీ తారాగణం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ నెల 15న జైలర్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

వెయ్యి కోట్ల సినిమాగా హైప్:

జైలర్ 2ను తమిళ చిత్ర పరిశ్రమలో తొలి వెయ్యి కోట్ల సినిమాగా నిలుస్తుందని కొందరు అంచనాలు వేస్తున్నారు. గతంలోనూ కొన్ని భారీ తమిళ సినిమాలకు ఇదే స్థాయిలో హైప్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ‘లియో’, ‘కంగువ’, ‘కూలీ’, ‘జననాయకన్’ వంటి సినిమాల విషయంలోనూ విడుదలకు ముందు భారీ కలెక్షన్ల అంచనాలు, హైప్ కనిపించాయి. అయితే ఆ సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఇప్పుడు అదే తరహాలో జైలర్ 2కు కూడా వెయ్యి కోట్ల మార్క్‌పై చర్చ మొదలైంది. అయితే సినిమా ట్రైలర్‌ను చూసిన తర్వాత ఈ అంచనాలపై కొంతమంది సినీ అభిమానులు, విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

జైలర్ సక్సెస్‌కు అసలు కారణం రజనీకాంతే:
2023లో విడుదలైన ‘జైలర్’ భారీ విజయాన్ని అందుకుంది. రజనీకాంత్ మాస్ ఇమేజ్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతం, నెల్సన్ టేకింగ్, అదిరిపోయే ఎలివేషన్లు బాగా కలిసొచ్చాయి. ముఖ్యంగా రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. సినిమాలో విలన్ పాత్ర ఆశించిన స్థాయిలో బలంగా లేకపోవడంతో హీరో ఆధిపత్యం ఎక్కువగా కనిపించిందనే విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి. అయినప్పటికీ రజనీకాంత్ స్టార్‌డమ్ సినిమాకు భారీ వసూళ్లు తీసుకొచ్చింది.

జైలర్ 2 కంటెంట్‌పై మిక్స్‌డ్ టాక్:
జైలర్ 2 విషయానికి వస్తే ఇప్పటివరకు విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్‌కు మిశ్రమ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్‌లో కథలోని ప్రధాన అంశాలను ఎక్కువగా రివీల్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో సినిమాలో ఇంకా ఏమైనా సర్‌ప్రైజ్‌లు దాచిపెట్టారా? అనే ఆసక్తి పెరిగింది. ట్రైలర్ ప్రకారం.. మొదటి భాగంలో వర్మను అంతం చేసిన తర్వాత ముత్తువేల్ పాండ్యన్ మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లి సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే వర్మకు సంబంధించిన భారీ నెట్‌వర్క్ ముత్తువేల్ కోసం వేట మొదలుపెడుతుంది. దీంతో ముత్తువేల్ మరోసారి తన గతాన్ని బయటకు తీసి ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగుతాడు.
ఈ పోరాటంలో శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ పాత్రలు కూడా కీలకంగా ఉండనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ముత్తువేల్ పాండ్యన్ తన ప్రత్యర్థుల గ్యాంగ్‌ను ఎలా ఎదుర్కొంటాడు? ఈసారి అతడి ముందున్న అసలు సమస్య ఏమిటి? అనేదే కథలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది.

కథ మొత్తం ట్రైలర్‌లోనే చెప్పేశారా?:
జైలర్ 2 ట్రైలర్‌పై వస్తున్న ప్రధాన విమర్శల్లో కథలోని కీలక అంశాలను ముందుగానే బయటపెట్టారనేది ఒకటి. హీరో గతం, అతడిని వెతుకుతున్న గ్యాంగ్, కౌంటర్ ఎటాక్ వంటి అంశాలు ట్రైలర్‌లోనే కనిపించడంతో సినిమాలో కొత్తగా చూపించేది ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే ట్రైలర్‌లో కనిపించని ట్విస్టులు, సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ సినిమాలో ఉంటే మాత్రం పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంది. అప్పుడే కలెక్షన్ల వర్షం కురవనుంది. అంచనాలు భారీగా ఉన్నప్పటికీ.. వెయ్యి కోట్ల మార్క్‌ను అందుకోవడం అంత సులభమైన విషయం కాదు. జైలర్ మ్యాజిక్‌ను సీక్వెల్ కూడా రిపీట్ చేస్తుందా? లేదా భారీ హైప్‌కు భిన్నంగా సాధారణ స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా మిగిలిపోతుందా? అనేది సినిమా విడుదలైన తర్వాతే తేలనుంది.