
- వామ్మో..మెడికల్ బిల్
- ప్రభుత్వ ఆస్పత్రుల కంటే 10 రెట్లు ఎక్కువ
- విదేశీ పెట్టుబడులతో రోగిపై అదనపు భారం
- ఐదేళ్లలో గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.96,270 కోట్ల పెట్టుబడులు
- కార్పొరేట్ల చేతుల్లోకి చిన్న ఆస్పత్రులు
- నియంత్రణ అవసరమన్న పార్లమెంటరీ కమిటీ
న్యూఢిల్లీ: భారత హెల్త్‌కేర్ రంగంలోకి విదేశీ పెట్టుబడుల రాక పెరిగినప్పటికీ, రోగుల జేబుపై భారం ఎక్కువయింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స వ్యయం ప్రభుత్వ ఆస్పత్రుల కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితికి విదేశీ ఇన్వెస్టర్లు పరోక్షంగా కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో విదేశీ ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలైన బ్లాక్‌స్టోన్, కేకేఆర్, టీపీజీ, జనరల్ అట్లాంటిక్, టెమాసెక్ వంటివి దాదాపు 10 బిలియన్ డాలర్ల నిధులను (రూ.96,270 కోట్లు) దేశీయ ఆస్పత్రుల్లో ఇన్వెస్ట్ చేశాయి. ఈ నిధుల రాకతో కొత్త ఆసుపత్రుల నిర్మాణం, పరికరాల కొనుగోలు ఊపందుకుంది. అయితే, పీఈ సంస్థలు గుండె ఆపరేషన్లు, క్యాన్సర్ కేర్ వంటి అధిక ఆదాయం ఇచ్చే ప్రత్యేక విభాగాలపై ఫోకస్ చేశాయి.
వీటి మద్దతు ఉన్న ఆసుపత్రులు దేశంలోని మొత్తం పడకల్లో 5 శాతం కంటే తక్కువే ఉన్నప్పటికీ, ప్రధాన చికిత్సల మార్కెట్లలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఆసుపత్రుల ఆదాయం, వాటి విలువ గణనీయంగా పెరగడం వల్ల పెట్టుబడిదారులకు భారీ రాబడులు లభించాయి. మణిపాల్ హెల్త్‌లో టెమాసెక్ పెట్టిన పెట్టుబడికి దాదాపు 10 రెట్ల రాబడి లభించింది. కేకేఆర్ సంస్థ బేబీ మెమోరియల్ ఆసుపత్రిలో పెట్టుబడులు పెట్టి 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.600 కోట్ల ఇబిటా సాధించింది. మెడికవర్ ఆసుపత్రులను 1.4 బిలియన్ డాలర్లకు స్వాధీనం చేసుకుని దక్షిణ భారతంలో తన పడకల సంఖ్యను 10 వేలకు పెంచుకుంది. 2027 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ ఆసుపత్రుల రాబడి 15 శాతం వరకు పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేసింది. ప్రైవేట్ మూలధనం వేగంగా పెరగడం వల్ల వైద్య ఖర్చులు పెరిగాయి. ప్రభుత్వ సాయం లేని, పెరిగిన వైద్య ఖర్చులను భరించలేని మధ్యతరగతి ప్రజలపై ఈ ఆర్థిక భారం తీవ్ర ప్రభావం చూపుతోంది.
పార్లమెంటరీ కమిటీ ఆందోళన
ఈ పరిణామాలపై పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ నిధుల రాక వల్ల చిన్న, మధ్యతరగతి ఆసుపత్రులను కార్పొరేట్ సంస్థలు చేజిక్కించుకుంటున్నాయని హెచ్చరించింది. వైద్య సేవల ధరలకు పరిమితిని విధించాలని, ఆసుపత్రుల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు సిఫార్సు చేశారు. వార్షిక వైద్య ద్రవ్యోల్బణం 13 శాతం వరకు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఆసుపత్రులు, బీమా కంపెనీల నడుమ వివాదాలు ముదురుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు బిల్లులను విపరీతంగా పెంచి, రోబోటిక్ సర్జరీల వంటి ఖరీదైన వైద్య విధానాలను రోగులపై రుద్దుతున్నాయని బీమా సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ఉదాహరణకు ముంబైకి చెందిన ఒక మహిళ ఏటా రూ.21 వేలు ప్రీమియం చెల్లించి రూ.15 లక్షల క్లెయిమ్ పాలసీ తీసుకున్నప్పటికీ, రోబోటిక్ సర్జరీని బీమా కంపెనీ తిరస్కరించింది. బీమా సంస్థల చెల్లింపులు ఆలస్యం కావడం, తక్కువ క్లెయిమ్ మొత్తాలు ఇస్తుండటం వల్ల తమ లాభాలు తగ్గుతున్నాయని ఆసుపత్రులు చెబుతున్నాయి. బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ క్యాష్‌లెస్ చికిత్స కోసం కొత్త నిబంధనలు తెచ్చింది.