
కాంగో నదిలో ఘోర ప్రమాదం జరిగింది. నదిలో రెండు పడవలు ప్రమాదవశాత్తూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యల ప్రయాణికులు గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం (అక్టోబర్ 4) ఈక్వేటర్ ప్రావిన్స్‌లోని న్గోంబే-లుకోలేలా ప్రాంతం సమీపంలో జరిగింది.
అధికారుల వివరాల ప్రకారం.. పడవల్లో ఒకటి దేశంలోని వాయువ్య ప్రాంతంలోని ఉబాంగి నుంచి కాంగో రాజధాని కిన్షాసాకు ప్రయాణిస్తుండగా.. మరో పడవ కిన్షాసా నుంచి లుకోలెలాకు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో పడవలు ప్రమాదవశాత్తూ ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నీట మునిగి 30 మంది చనిపోగా.. పలువురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహయక చర్యలు చేపట్టారు.
నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల స్పష్టమైన కారణం ఏంటన్న తెలియరాలేదు. ప్రమాదానికి గురైన పడవల్లో ఒకటి చమురు తీసుకు వెళ్తుందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ప్రమాదం తర్వాత చమురు మొత్తం నదిలో పడిపోవడంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
కొందరికి ఈత వచ్చినా కూడా భారీ పరిమాణంలో చమురు నీటిపై తెలుతుండటంతో తప్పించుకోవడం సాధ్యం కాలేదని తెలిపారు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాంగోలో పడవ ప్రమాదం సాధారణంగా మారిపోయి.. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.