
డౌటేలేదు…. నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది. నా ప్రతి మూమెంట్‌ను ప్రత్యర్థి లైవ్‌లో చూస్తున్నాడు. ఏదో ట్రాప్ వేస్తున్నారన్న ఆ మాజీ ఎమ్మెల్యే మాటలకు కలకలం రేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్టు ఇప్పుడాయన కొత్తగా వాడిన ట్రాప్ పదం చుట్టూ రకరకాల డౌట్స్ పెరుగుతున్నాయి. ఎవరా ఎక్స్ ఎమ్మెల్యే? ఏంటా ట్రాప్ స్టోరీ?
నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు…. చుట్టూ ఉన్నవాళ్ళను ట్రాప్ చేస్తున్నారు. తాడిపత్రి వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఏపీ పాలిటిక్స్‌లో కూడా కలకలం రేపుతున్నాయి. మున్సిపల్ మాజీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి – కేతిరెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఆధిపత్య పోరు జరుగుతున్నా…. ఇప్పుడు కొత్తగా ట్రాప్ అనే ఒక్క పదం చుట్టూ చర్చ తీవ్రస్థాయిలో జరుగుతోంది. తన ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల లైవ్ యాక్సెస్‌ను అధికార పార్టీకి ఇచ్చారని, తన సొంత గన్‌మెన్‌ను కూడా ట్రాప్ చేసి తన కదలికలను పసిగడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే.
రక్షణ కల్పించాల్సిన ఖాకీలే కోవర్టులుగా మారితే.. తనకు భద్రత ఎక్కడిదని కూడా ప్రశ్నించారాయన.ఈ మొత్తం వ్యవహారం మీద థర్డ్ పార్టీ దర్యాప్తు జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. తన ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మూకలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. నిలదీసిన తమ అనుచరులపైనే రివర్స్‌లో న్యూసెన్స్ కేసులు పెట్టారని చెబుతున్నారు పెద్దారెడ్డి. అయితే అందుకు టీడీపీ వైపు నుంచి కూడా గట్టి కౌంటర్సే పడుతున్నాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో టిడిపి కార్యకర్తలు, జేసీ కుటుంబంపై నమోదైన కేసులు, వైసిపి నేతలు చేసిన దాడుల్లాంటి అన్ని అంశాల మీద కేతిరెడ్డి ఎందుకు మాట్లాడరంటూ ప్రశ్నిస్తున్నారు జేసీ వర్గీయులు.
ఆ సంగతులన్నీ మాట్లాడకుండా… ఇప్పుడు తన మనస్తత్వానికి తగ్గట్టు ఏదేదో ఊహించేసుకుని ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేస్తే ఎలాగని నిలదీస్తున్నారు టీడీపీ లీడర్స్. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే…. కేవలం బురద చల్లడానికే పెద్దారెడ్డి నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారంటూ టిడిపి మాజీ కౌన్సిలర్లు విమర్శిస్తున్నారు. పెద్దారెడ్డి గన్‌మెన్‌ను ట్రాప్ చేయాల్సిన అవసరం ఇక్కడెవరికీ లేదని అంటున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో ఉనికి కోసమే వైసీపీ నేతలు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నది టీడీపీ వెర్షన్. అదంతా ఒక ఎత్తయితే… గన్‌మెన్‌ను ట్రాప్ చేస్తున్నారన్న అంశం చుట్టూనే ఇప్పుడు వ్యవహారం మొత్తం తిరుగుతోంది.
పెద్దారెడ్డి చేసిన ఆరోపణలను ఇటు పోలీసు వర్గాలు కూడా కొట్టి పారేస్తున్నాయి. అందుకు సంబంధించి ఏదైనా ఆధారాలు ఉంటే మాజీ ఎమ్మెల్యే ఇవ్వాలని అడుగుతున్నారు జిల్లా పోలీసులు. అయితే… ఆయన మాత్రం సరైన సమయంలో ఆధారాల్ని బయటపెడతానని చెబుతున్నారు. దీంతో…ఈ ఎపిసోడ్ ఎట్నుంచి ఎటు పోతుందోనన్న ఆందోళన కూడా తాడిపత్రిలో వ్యక్తం అవుతోంది. సహజంగానే ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉంటాయి. ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది.
ఇలాంటి సమయంలో ఈ ఒక్క అంశాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారు అన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితుల కోణంలోనే ట్రాప్ అంశం తెరపైకి వచ్చి ఉండవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు నుంచే తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి పోరు తీవ్రంగా మారింది. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయోనని కాస్త ఆందోళనగా, ఒకింత ఉత్కంఠగా చూస్తున్నాయి రెండు పార్టీల శ్రేణులు.