Reading Time: < 1 minute
Ap Approves Police Commissionerates In Four Cities Village Re Notifications

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో కొత్తగా పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, గుంటూరు నగరాల్లో కమిషనరేట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిషనరేట్లకు ఐజీపీ లేదా డీఐజీ స్థాయి అధికారిని కమిషనర్‌గా నియమించనున్నారు.

కొత్తగా ఏర్పాటు చేయనున్న కమిషనరేట్లకు కమిషనర్లకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను కూడా ప్రభుత్వం కల్పించనుంది. దీంతో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాల్లో పోలీసులకు మరింత సమన్వయంతో పనిచేసే అవకాశం కలగనుంది. నగర ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, నేరాల నియంత్రణకు కమిషనరేట్ వ్యవస్థ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొత్త కమిషనరేట్ల ఏర్పాటులో ప్రస్తుతం ఉన్న పోలీస్ బలగాలనే వినియోగించనున్నారు. ఇందుకోసం అదనంగా కొత్త పోస్టులను సృష్టించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న సిబ్బంది, వనరులను అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసి కమిషనరేట్ వ్యవస్థను అమలు చేయనున్నారు.

విలీన గ్రామాలపై హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు
మరోవైపు రాష్ట్రంలోని కొన్ని విలీన గ్రామాలకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ తాజా నోటిఫికేషన్లు జారీ చేసింది. గతంలో విలీనం చేసిన కొన్ని గ్రామాలను తిరిగి పంచాయతీలుగానే కొనసాగిస్తూ రీనోటిఫికేషన్ ఇచ్చింది. ఆయా గ్రామాల పరిపాలనా స్థితిని యథాతథంగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తుని మండలంలోని నాలుగు గ్రామాలను గ్రామ పంచాయతీలుగానే కొనసాగిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. అదే సమయంలో రాజమండ్రి రూరల్, కోరుకొండ, రాజానగరం ప్రాంతాల్లోని పది గ్రామాలను డీనోటిఫై చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని కాసుకర్రు గ్రామాన్ని కూడా గ్రామ పంచాయతీగానే కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ మార్పులు చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ.. ఆయా గ్రామాల విషయంలో పంచాయతీ వ్యవస్థను కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పోలీస్ పరిపాలనలో కమిషనరేట్ వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో పాటు, మరోవైపు గ్రామాల పరిపాలనా హోదాపై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లైంది.