
Hong Kong Sixes 2026: ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన, ప్రత్యేకమైన క్రికెట్ టోర్నీల్లో ఒకటైన హాంకాంగ్ సిక్సెస్ 2026 (Hong Kong Sixes 2026) మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. కేవలం ఆరు ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి అగ్రశ్రేణి క్రికెట్ దేశాలు పాల్గొంటున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు హాంకాంగ్‌లో టోర్నీ జరగనుంది.
భారత్ ఈసారి ఐపీఎల్ అనుభవం ఉన్న ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది. భారత జట్టుకు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. క్రునాల్ పాండ్యా, నితీశ్ రాణా, శశాంక్ సింగ్, టి. నటరాజన్, రాహుల్ త్రిపాఠి, రాహుల్ తెవాటియా జట్టులో ఉన్నారు.
హాంకాంగ్ సిక్సెస్ అంటే?
హాంకాంగ్ సిక్సెస్ అనేది ఆరు మంది ఆటగాళ్లతో కూడిన ప్రత్యేకమైన క్రికెట్ టోర్నమెంట్. సాధారణ క్రికెట్‌తో పోలిస్తే ఈ ఫార్మాట్‌లో ఆట చాలా వేగంగా సాగుతుంది. బ్యాటర్లు తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ టోర్నీ హాంకాంగ్‌లోని కౌలూన్ క్రికెట్ క్లబ్‌లో నిర్వహిస్తారు. క్రికెట్ హాంకాంగ్ ఆధ్వర్యంలో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అనుమతితో ఈ టోర్నీ జరుగుతుంది. హాంకాంగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ సిక్సెస్ టోర్నమెంట్ 1992 నుంచి 2017 వరకు జరిగింది. అనంతరం కొంత విరామం తర్వాత 2024లో మళ్లీ ప్రారంభమైంది. షేన్ వార్న్, వసీం అక్రమ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ వంటి ప్రముఖ క్రికెటర్లు కూడా ఈ టోర్నీలో ఆడారు.
హాంకాంగ్ సిక్సెస్ 2026 రూల్స్..
* ఈ టోర్నీలో ఒక్కో జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఉంటారు. ఒక్కో మ్యాచ్‌లో ప్రతి జట్టుకు గరిష్ఠంగా ఐదు ఓవర్లు మాత్రమే ఉంటాయి. ఫైనల్లో మాత్రం ఒక్కో జట్టుకు ఐదు ఓవర్లు, ఒక్కో ఓవర్‌కు ఎనిమిది బంతుల చొప్పున బౌలింగ్ ఉంటుంది.
* వికెట్ కీపర్ మినహా ఫీల్డింగ్ చేసే ప్రతి ఆటగాడు ఒక్క ఓవర్ తప్పనిసరిగా బౌలింగ్ చేయాలి. వైడ్, నోబాల్‌కు రెండు పరుగుల పెనాల్టీ ఉంటుంది.
* ఐదు వికెట్లు పడిపోయిన తర్వాత చివరి బ్యాటర్ ఒక్కడే బ్యాటింగ్ కొనసాగిస్తాడు. ఐదో బ్యాటర్ రన్నర్‌గా వ్యవహరిస్తాడు. నాటౌట్ బ్యాటర్ అవుట్ అయ్యే వరకు అతడే స్ట్రైక్‌లో కొనసాగాలి.
* ఏదైనా బ్యాటర్ 31 పరుగులు చేసిన వెంటనే రిటైర్ కావాలి. మిగిలిన బ్యాటర్లు అందరూ అవుట్ లేదా రిటైర్ అయిన తర్వాత అతడు మళ్లీ బ్యాటింగ్‌కు రావచ్చు. ప్రతి మ్యాచ్‌ను కేవలం 45 నిమిషాల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.
హాంకాంగ్ సిక్సెస్ 2026 ఫార్మాట్..
ఈసారి మొత్తం 12 జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. వాటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో మూడు జట్లు ఉంటాయి. గ్రూప్ దశలో రౌండ్ రాబిన్ విధానంలో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత నాకౌట్ దశలో విజేతను నిర్ణయిస్తారు. ప్రధాన నాకౌట్ దశకు అర్హత సాధించని జట్లు బౌల్, ప్లేట్ మ్యాచ్‌ల్లో పాల్గొని తమ తుది స్థానాలను నిర్ణయించుకుంటాయి.
హాంకాంగ్ సిక్సెస్ 2026లో 12 జట్లు..
పూల్-A: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, హాంకాంగ్ చైనా.
పూల్-B: శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్.
పూల్-C: భారత్, పాకిస్థాన్, యూఏఈ.
పూల్-D: దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, ఒమన్.
హాంకాంగ్ సిక్సెస్ విజేతలు..
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో ఇప్పటివరకు పాకిస్థాన్ అత్యధిక సార్లు విజేతగా నిలిచింది. 1992లో తొలి టైటిల్‌ను అందుకున్న పాకిస్థాన్.. 1997, 2001, 2002, 2011, 2025లోనూ ఛాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లండ్ కూడా 1993, 1994, 2003, 2004, 2008లో టైటిల్ సాధించి ఐదు సార్లు విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికా 1995, 2006, 2009, 2012, 2017లో ఐదు టైటిళ్లు గెలుచుకుంది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్, భారత్, శ్రీలంక కూడా ఈ టోర్నీలో ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి. భారత్ 2005లో వెస్టిండీస్‌ను ఓడించి హాంకాంగ్ సిక్సెస్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2024లో శ్రీలంక ఛాంపియన్‌గా నిలవగా, 2025లో పాకిస్థాన్ టైటిల్ గెలిచింది. తాజా ఎడిషన్‌లో కువైట్ రన్నరప్‌గా నిలిచింది.
The countdown is ON!
The Hong Kong Sixes is back – and the stage is set for sixes, big hits and non-stop action!
Here’s a glimpse from the press conference as we gear up for another blockbuster edition!
#TurnItUpToSix #HongKongSixes https://t.co/1xLygiZqwp
— Cricket Hong Kong, China (@CricketHK) October 4, 2026



