Reading Time: 2 minutes
Gst Council Meeting Postponed October 8

జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 7న జరగాల్సిన ఈ సమావేశాన్ని అక్టోబర్ 8కి మార్చారు. ‘అనివార్య పరిస్థితుల’ కారణంగా సమావేశ తేదీని మార్చినట్లు జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ కార్యాలయ మెమోలో వెల్లడించింది. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వాయిదా పడటం రెండోసారి. తొలుత ఈ సమావేశాన్ని సెప్టెంబర్ 12న నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అదే సమయంలో ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగడంతో సమావేశాన్ని అక్టోబర్ 7కి వాయిదా వేశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనుంది. జీఎస్టీ రిజిస్ట్రేషన్, రిటర్నుల దాఖలు, రీఫండ్ల ప్రక్రియలో మార్పులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే జీఎస్టీకి సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు విధానపరమైన సంస్కరణలు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రవాహాన్ని మెరుగుపరిచే చర్యలపైనా చర్చ జరగనుంది. వ్యాపార సంస్థలకు జీఎస్టీ నిబంధనల అనుసరణలో పడే సమయం, ఖర్చును తగ్గించడమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.

సమావేశంలో జీఎస్టీ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కొన్ని నేరాలను డీక్రిమినలైజ్ చేసే అంశాన్ని కూడా కౌన్సిల్ పరిశీలించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ సమాచారం. అలాగే జీఎస్టీ అధికారులు అరెస్టులు చేసే అధికారాలను తొలగించడం, వ్యాపారాలకు పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేయడం వంటి ప్రతిపాదనలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ-కామర్స్ రంగంలో పనిచేసే సరఫరాదారులకు కూడా జీఎస్టీ అనుసరణను సులభతరం చేసే మార్పులను పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 2025 సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరిగింది. ఆ సమావేశంలో కేంద్రం, రాష్ట్రాలు జీఎస్టీ రేట్లు, స్లాబ్‌లను భారీగా పునర్వ్యవస్థీకరించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. 2025 సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీని ప్రధానంగా 5 శాతం, 18 శాతం అనే రెండు శ్లాబ్‌లుగా మార్చారు. అత్యంత విలాసవంతమైన వస్తువులు, ‘సిన్ గూడ్స్‌’పై అత్యధికంగా 40 శాతం జీఎస్టీ రేటును నిర్ణయించారు. అంతకుముందు 2017 జూలై 1 నుంచి అమల్లో ఉన్న 5, 12, 18, 28 శాతం నాలుగు జీఎస్టీ స్లాబ్‌ల స్థానంలో ఈ కొత్త విధానం తీసుకొచ్చారు. ఇప్పుడు జరగనున్న 57వ సమావేశంలో రేట్ల కంటే జీఎస్టీ ప్రక్రియను మరింత సులభతరం చేయడం, పన్ను వివాదాలను తగ్గించడం, వ్యాపారాలపై అనుసరణ భారం తగ్గించడం వంటి అంశాలకు ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది.