
వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో అజేయ శతకం సాధించినప్పటికీ, భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టు విజయం సాధించలేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం తన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయలేకపోయినందుకు బాధగా ఉందన్నారు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ తర్వాత తనకు మిడిలార్డర్‌లో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదని, వచ్చే ఏడాది అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ వస్తుండటంతో క్రీజులో విలువైన సమయం గడపడం తనకు చాలా ముఖ్యమని రాహుల్ స్పష్టం చేశారు. నెట్స్ లో తాను చేస్తున్న కష్టాన్ని మ్యాచ్‌లో పరిశీలించుకోవడానికి ఈ ఇన్నింగ్స్ దోహదపడిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఎదురయ్యే సవాళ్ల గురించి మాట్లాడుతూ.. గత ఆరేడేళ్లుగా తాను ఈ పాత్రను పోషిస్తున్నానని తెలిపారు. అయితే గత ఒకటిన్నర సంవత్సరాలుగా మారుతున్న నిబంధనల వల్ల పరిస్థితులు చాలా మారాయని, మ్యాచ్ చివరి దశలో పాత బంతి సాఫ్ట్ అయి రివర్స్ స్వింగ్ అవుతున్నప్పుడు పెద్ద షాట్లు ఆడటం కష్టమవుతోందని చెప్పారు. తాను ఎప్పుడూ టాప్ ఆర్డర్‌లో ఆడేవాడినని, వేగంగా వచ్చే హార్డ్ బాల్ తనకు ఇష్టమని పేర్కొన్నారు. కానీ, మిడిలార్డర్‌లో నంబర్ 5 లేదా 6 స్థానాల్లో ఆడేవారు పాత బాల్‌తోనూ ఆడటంలో పట్టు సాధించాలని, జట్టు కోసం నిలకడగా రాణించేందుకు తాను ఇదే అంశంపై ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు రాహుల్ వెల్లడించారు.
ఇక 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలపై స్పందిస్తూ.. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లు జట్టుకు ప్రయోగాలు చేయడానికి చక్కటి అవకాశమని అభిప్రాయపడ్డారు. వన్డే క్రికెట్‌లో ఇప్పుడు 340-350 పరుగులు కూడా సులభంగా ఛేదించబడుతున్నాయని, అందుకే తమ బ్యాటింగ్ యూనిట్ కేవలం 330 పరుగులకే పరిమితం కాకుండా 370 నుంచి 400 పరుగుల మార్క్‌ను చేరుకునేలా దూకుడుగా ఆడటంపై దృష్టి పెట్టిందని తెలిపారు. క్రీజులోకి రాగానే ఎక్కువ సమయం తీసుకోకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ బౌండరీలు బాదడమే తమ లక్ష్యమని చెప్పారు. యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వడానికి కోచ్, కెప్టెన్ స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారని కేఎల్ రాహుల్ తెలిపారు.