Reading Time: < 1 minute

లక్షల మంది ఓట్లను తొలగించడం రాజ్యాంగ ఉల్లంఘనే: సుప్రీం జస్టిస్ ఉజ్జల్ భూయాన్

Caption of Image.

హైదరాబాద్: లక్షలాది మంది ఓటు హక్కులను తొలగించడం రాజ్యాంగ వ్యవస్థను ఉల్లంఘించడమేనని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. “ఎంత వాదించినా దాన్ని సమర్థించలేరు… ఇది రాజ్యాంగ మూలంగా దెబ్బతీస్తుంది,” అని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘సర్’ ప్రక్రియపై పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారీ సంఖ్యలో భారత పౌరుల ఓటు హక్కులను హరించే ఏ ప్రక్రియ అయినా “రాజ్యాంగ వ్యవస్థను ఉల్లంఘించడమే” అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ ఆదివారం అన్నారు. “ఏ అధికార సంస్థ కూడా అలా చేయకూడదు.. ఏ న్యాయస్థానం కూడా దానిని సహించకూడదు” అని ఆయన స్పష్టం చేశారు. “భారత రాజ్యాంగం ఓటు హక్కు ఉన్న పౌరులు, ఓటు హక్కు లేని పౌరులు అని రెండు వర్గాల పౌరులను ఏర్పాటు చేయలేదు” అని జస్టిస్ భూయాన్ గుర్తు చేశారు.

“ఏదైనా ప్రక్రియ లక్షలాది భారత పౌరుల ఓటు హక్కును హరించి, వారిని సొంత దేశంలోనే ఓటు హక్కు లేని పౌరులుగా, రెండవ తరగతి పౌరులుగా మార్చినట్లయితే, అటువంటి ప్రక్రియ స్వభావరీత్యా ఏకపక్షమైనది. ఎంత వాదించినా దానిని సమర్థించలేము.. ఇది రాజ్యాంగ మూలాలనే దెబ్బతీస్తుంది,” అని ఆయన అన్నారు. సమానత్వ హక్కుకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను, సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించే ఆర్టికల్ 326ను ఇటువంటి చర్య ఉల్లంఘిస్తుందని ఆయన అభివర్ణించారు.

►ALSO READ | పాకిస్తానీ మహిళా గూఢచారి హనీ ట్రాప్.. వైజాగ్ నేవల్‌ బేస్‌ డేటా లీక్.. నేవీ ఆఫీసర్ అరెస్ట్

“ఇది భారత రాజ్యాంగం ప్రకారం మనం స్వీకరించిన రాజ్యాంగ వ్యవస్థకు విరుద్ధమని నేను చెప్పగలను,” అని ఆయన అన్నారు. ఎన్నికల జాబితాలపై భారత ఎన్నికల సంఘం చేస్తున్న ప్రత్యేక విస్తృత సవరణ (SIR)ను సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా సమర్థించిన నాలుగు నెలల తర్వాత జస్టిస్ భూయాన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది.

©️ VIL Media Pvt Ltd.