
నవరాత్రి, దసరా, దివాళీ వంటి వరుస పండుగల వేళ సెలవుల్లో ప్రయాణాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో రద్దీని తట్టుకుంటూ తక్కువ బడ్జెట్‌లో హాయిగా ట్రిప్ ప్లాన్ చేయడానికి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) అధ్యక్షుడు రవి గోసాయిన్ కొన్ని ముఖ్యమైన చిట్కాలను పంచుకున్నారు. ఈ టిప్స్ పాటించటం ద్వారా పండుగ సీజన్‌లోనూ ప్రయాణ ఖర్చులను అదుపులో ఉంచుకుని హ్యాపీగా ట్రిప్ పూర్తి చేయవచ్చని ఆయన సూచించారు.
1. ముందస్తు ప్లానింగ్:
పండుగల సమయంలో ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా ప్రయాణ తేదీలు, వెళ్లాల్సిన ప్రదేశం, రవాణా మార్గాన్ని (రైలు, బస్సు లేదా విమానం) ముందే ఖరారు చేసుకోవాలి. చివరి నిమిషంలో బుకింగ్స్ చేసుకుంటే ధరలు విపరీతంగా పెరగడమే కాకుండా, నచ్చిన హోటళ్లు లేదా సీట్లు దొరకడం కష్టమవుతుంది.
2. స్పష్టమైన బడ్జెట్ కేటాయింపు:
ప్రయాణానికి ముందే ప్రయాణ ఖర్చులు, హోటల్ బస, ఆహారం, స్థానిక దర్శనాలు, షాపింగ్ కోసం ఎంత ఖర్చు చేయాలనే దానిపై ప్రాథమిక అంచనా వేసుకోవాలి. అలాగే అత్యవసర ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా పక్కన పెట్టుకోవాలి. వేర్వేరు యాప్‌లు, వెబ్‌సైట్లలో ధరలను పోల్చి చూసి అత్యుత్తమ ఆఫర్లను ఎంచుకోవడం మంచిది.
3. క్యాన్సిలేషన్ ప్లాన్, లొకేషన్ ఎంపిక:
హోటళ్లు లేదా రవాణా టికెట్లు బుక్ చేసేటప్పుడు ఒకవేళ ప్రయాణం రద్దయితే ఎంత రుసుము కోల్పోవాల్సి వస్తుందో ముందే తనిఖీ చేసుకోవాలి. ఫ్లెక్సిబుల్ రీఫండ్ ఆప్షన్లు ఉన్న చోటే బుకింగ్స్ చేసుకోవడం శ్రేయస్కరం. అలాగే మీరు ఎంచుకునే బస ముఖ్య పర్యాటక ప్రాంతాలకు చేరువగా ఉంటే స్థానిక రవాణా ఖర్చులు తగ్గుతాయి.
4. అవసరమైన సామాగ్రినే ప్యాక్ చేయండి:
పండుగల సమయంలో జనసమ్మర్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రయాణంలో తక్కువ లగేజీ ఉండటమే మంచిది. వాతావరణానికి తగిన దుస్తులు, కంఫర్టబుల్ షూస్, రెగ్యులర్ మందులు, ఛార్జర్‌లు, గుర్తింపు కార్డులు మాత్రమే వెంట తీసుకెళ్లాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా పండుగల వేళ ఎలాంటి ఒత్తిడి లేకుండా, బడ్జెట్ పరిమితిలోనే కుటుంబంతో కలిసి ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.