Reading Time: < 1 minute
గురుకులంలో దారుణం..క్యూలైన్ వివాదంలో వేడి కూర దబరాలో పడ్డ ఏడో తరగతి విద్యార్థిని!

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల.. ఈ రోజు ఆదివారం సెలవు కావడంతో కొంతమంది విద్యార్ధినిల తల్లిదండ్రులు రావడంతో వారితో కలిసి బయట మాట్లాడుతున్నారు. మరికొంత మంది మద్యాహ్న భోజనం తినేందుకు డైనింగ్ హాల్ వద్దకు వెళ్లారు. అక్కడ విద్యార్థినులంతా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. అయితే ఆ సమయంలోనే ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినికి మరొకరికి మధ్య చిన్నపాటి వివాదం మొదలైంది. క్యూలైన్ తాను ముందంటే తానే ముందంటూ నెట్టుకుంటున్నారు. ఈ తతంగాన్ని తోటి విద్యార్థినిలు చూస్తేనే ఉన్నారు

అయితే సడెన్ గా ఏడో తగరగతి విద్యార్థినిని మరొవ బాలిక బలంగా నెట్టడంతో ఆమె అక్కడే ఉన్న కూర దబరాలో పడింది. కూర వేడిగా ఉండటంతో ఒక్కసారిగా ఏడో తరగతి బాలిక పెద్దగా కేకలు పెట్టింది. దీంతో తోటి బాలికలంతా కంగారు పడిపోయారు. వెంటనే అన్నం వడ్డిస్తున్న ఆయాలు బాలికను కూర దబరాలో నుండి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం బాలిక చికిత్స పొందుతుంది. ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. అయితే ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయని గురుకులం టీచర్లు తమకు సకాలంలో సమాచారం అందించలేదని బాధితురాలి బంధువులు ఆరోపించారు. మొదట ఫోన్ చేసి స్వల్ప గాయాలయినట్లు చెప్పారని ఆసుపత్రికి వచ్చి చూడగా ఒక వైపంతా కాలిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యహరించారని విమర్శించారు. అయితే ప్రస్తుతం బాలికకు చికిత్స కొనసాగుతుంది. చిన్న వివాదంలో బాలికకు తీవ్ర గాయాలు కావడం తోటి స్నేహితులను కలవరపాటుకు గురి చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.