
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో మార్మోగిపోతున్న “జిమ్ జిమ్ తార” పాట నెట్టింట ఎలాంటి సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. అయితే, అసలు ఈ పాట ఎక్కడిది? ఎవరిది? అన్న దానిపై అనేక ఊహాగానాలు నడిచాయి. ఈ క్రమంలో ఈ పాట చుట్టూ జరుగుతున్న చర్చకు, కాపీ-రీమిక్స్ వివాదాలకు ‘పర్ణశాల’ చిత్ర బృందం అధికారికంగా తెరదించింది. ఈ పాట వెనుక ఉన్న అసలు నిజాన్ని వివరిస్తూ ‘పర్ణశాల’ చిత్ర నిర్మాత మంచి వెంకట్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. తమ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రికార్డు చేసుకున్న ‘జిమ్ జిమ్ తార’ పాటను, గాయని లక్ష్మీదేవి అనుకోకుండా బయట పాడారని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత నెటిజన్లు, కొందరు క్రియేటర్లు ఆ బిట్‌ను రీమిక్స్ చేసి సోషల్ మీడియాలో వదలడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. సినిమా తరఫున ఎలాంటి అధికారిక విడుదల లేకుండానే, పాట లీకై అనూహ్య రీతిలో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పరిణామం తమను ఆశ్చర్యానికి గురిచేసినా, ప్రజల నుంచి వచ్చిన స్పందన తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఫిల్మ్స్ (SLT ఫిల్మ్స్) అధినేత మంచి వెంకట్ తెలిపారు. ఊహించని విధంగా పాటను ఇంత పెద్ద ఎత్తున వైరల్ చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే ‘జిమ్ జిమ్ తార’ పూర్తి ఒరిజినల్ లిరికల్ వీడియోను అధికారికంగా రిలీజ్ చేయనున్నామని, అలాగే ‘పర్ణశాల’ చిత్రాన్ని కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని స్పష్టం చేశారు. పాటను ఎంతగానో గుండెల్లో పెట్టుకున్న ప్రేక్షకులు, సినిమాను కూడా అంతే ప్రేమించి భారీ విజయాన్ని అందించాలని ఆయన కోరారు.