
భావనగర్: గుజరాత్‌లోని భావనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భావనగర్–అలాంగ్ జాతీయ రహదారిపై సోమవారం (అక్టోబర్ 6) జరిగిన ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులతో వెళ్తున్న ఎస్‌యూవీ.. ట్రైలర్ ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు ఎస్‌యూవీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న వారు అలాంగ్‌లోని షిప్‌బ్రేకింగ్ యార్డుకు వెళ్తున్నారు. జాతీయ రహదారిపై వెళ్తుండగా వారి వాహనం ముందున్న ట్రైలర్ ట్రక్కు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. కారు ముందు భాగం ట్రైలర్‌లోకి దూసుకెళ్లడంతో వాహనం తీవ్రంగా దెబ్బతింది. అందులో ప్రయాణిస్తున్న వారు వాహనం లోపలే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే భారీ శబ్దం రావడంతో స్థానికులు, ఇతర వాహనదారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అలాంగ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా దెబ్బతిన్న ఎస్‌యూవీ నుంచి ప్రయాణికులను బయటకు తీసేందుకు సహాయక బృందాలు ప్రయత్నించాయి.
ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ప్రమాదం కారణంగా భావనగర్–అలాంగ్ జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించి రాకపోకలను పునరుద్ధరించారు.
ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై అలాంగ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్‌యూవీ వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం, రహదారి పరిస్థితులు, ట్రైలర్ నిలిపిన విధానం తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన ఆధారాలను సేకరించి, ప్రత్యక్ష సాక్షులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..