
మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురహరిపల్లి చెరువు కట్టపై ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేగింది. మృతుడు గుండ్లపోచంపల్లిలో నివాసముంటున్న నేమారం చౌదరి(55)గా పోలీసులు గుర్తించారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నెమరం చౌదరి రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఆయన అదృశ్యంపై శనివారం రోజు ఫిర్యాదు చేశారు.
నెమరం చౌదరి ఇంటి నుంచి బయలుదేరే సమయంలో తన వెంట సుమారు రూ.10 లక్షల నగదు తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి, సీఐ అంజిరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. మృతుని వెంట తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్న రూ.10 లక్షల నగదు అంశంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడికి భార్యతో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.