
ఆదిలాబాద్, వెలుగు: బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేసి డబ్బులు కాజేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన ప్రఫుల్ పాటిల్లో జులై నెలలో బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పిన నిందితుడు.. క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేస్తామని నమ్మించి రూ.73,279 కాజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మహారాష్ట్ర పూణేకు చెందిన చైతన్య ప్రమోద్ కుటె నిందితుడిగా గుర్తించారు.
మహారాష్ట్రకు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో యాక్సిస్ బ్యాంక్‌లో పని చేసిన నిందితుడు బ్యాంక్ కస్టమర్లకు సంబంధించిన ఫోన్ నంబర్లను సేకరించాడు. అనంతరం సిమ్ కార్డులు, ఫోన్లు మార్చి కస్టమర్లకు ఫోన్ చేసి క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు తెలుసుకొని డబ్బులు బదిలీ చేయించుకున్నాడు. తెలంగాణ, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో 150 మంది బాధితుల నుంచి రూ. 95,33,651 కాజేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఎస్సైలు గోపికృష్ణ, అశోక్ పాల్గొన్నారు.