Reading Time: < 1 minute
Telangana Eagle Force Cracks Down On Synthetic Drugs Pharma And Courier Networks

Telangana Eagle Force: తెలంగాణలో సింథటిక్ డ్రగ్స్, రసాయనాల అక్రమ తయారీ, రవాణాపై ఈగల్ ఫోర్స్ మరింత కఠిన చర్యలకు సిద్ధమైంది. డ్రగ్స్ తయారీకి ఉపయోగించే రసాయనాలు, పరికరాలపై నిఘాను పెంచడంతో పాటు ఫార్మా, కెమికల్ పరిశ్రమల రియాక్టర్ల లీజింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

డ్రగ్స్ తయారీకి రియాక్టర్లను అద్దెకు ఇచ్చే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈగల్ ఫోర్స్ నిర్ణయించింది. డ్రగ్స్ తయారీకి రియాక్టర్లను వినియోగిస్తున్నట్లు తేలితే సంబంధిత సంస్థల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునేలా నిఘా వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 80కి పైగా పరిశ్రమల్లో ఈగల్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పలు రసాయనాల నిల్వలు, వినియోగంపై వివరాలను పరిశీలించింది. తైవాన్‌కు ఏసీ కాంప్రెసర్ ఆయిల్ పేరుతో తరలిస్తున్న ప్రాపోఫోల్‌ను అధికారులు పట్టుకున్నట్లు వెల్లడైంది.

అదేవిధంగా 200 కిలోలకు పైగా అసిటిక్ అన్‌హైడ్రైడ్ నిల్వల్లో తేడాలను అధికారులు గుర్తించారు. డ్రగ్స్ తయారీలో ఉపయోగించే రసాయనాలు అక్రమంగా పక్కదారి పట్టకుండా పరిశ్రమల నుంచి వాటి నిల్వలు, వినియోగం వరకు పర్యవేక్షించాలని నిర్ణయించారు. పౌల్ట్రీ ఫారాలు, పాడుబడిన ఇళ్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో రహస్యంగా సింథటిక్ డ్రగ్స్ తయారు చేసే అవకాశాలపై కూడా ఈగల్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి పెట్టింది. మరోవైపు నిషేధిత సిగరెట్ల విక్రయాల మూలాలను గుర్తించి వాటి సరఫరా వ్యవస్థపై కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

డ్రగ్స్ రవాణాకు ఉపయోగించే మార్గాలపైనా నిఘా పెంచుతున్నారు. వి ట్రాన్స్, విఆర్‌ఎల్, రాపిడో, పోర్టర్ వంటి రవాణా సంస్థల ద్వారా డ్రగ్స్ తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. కొరియర్ సంస్థలు పార్శిళ్లకు సంబంధించిన ఇన్‌వాయిస్, ఈ-వే బిల్లులను తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులు సూచించారు. పార్శిల్ పంపేవారు, స్వీకరించేవారి పూర్తి వివరాలతో పాటు వారి గుర్తింపు పత్రాల వివరాలను కూడా రికార్డులో భద్రపరచాలని స్పష్టం చేశారు. డ్రగ్స్ రవాణాకు సహకరించినట్లు తేలితే సంబంధిత సంస్థల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో పనిచేస్తామని ఈగల్ ఫోర్స్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో డ్రగ్స్ తయారీ, సరఫరా, రవాణా వ్యవస్థను పూర్తిగా అడ్డుకోవడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. మత్తు రహిత తెలంగాణే లక్ష్యమని ఈగల్ ఫోర్స్ అధికారి సందీప్ శాండిల్య పేర్కొన్నారు.