
హైదరాబాద్: కాకా గడ్డం వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళులు అర్పించారు. ట్యాంక్ బండ్పై కాకా విగ్రహం దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి కాకాకు మంత్రి నివాళి అర్పించారు. పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాకా చేసిన సేవలను ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి గుర్తుుచేసుకున్నారు. కాకా జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ట్యాంక్ బండ్పై కాకా విగ్రహానికి పూల మాల వేసి ఆయన పెద్ద కుమారుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్.. కాకాకు నివాళి అర్పించారు. పేదలు ముద్దుగా కాకా, కార్మిక బాంధవుడుగా పిలుచుకునే వెంకటస్వామి 97వ జయంతి వేడుకల ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు గడ్డం వెంకటస్వామికి సీఎం రేవంత్ నివాళి అర్పించనున్నారు.
ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, కాకా వారసులు హాజరవుతారు. నాలుగు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా సేవలు అందించి రికార్డు సృష్టించిన ఘనత గడ్డం వెంకటస్వామి సొంతం. తెలంగాణ రాజకీయాల్లో కాకా వెంకటస్వామికి ప్రత్యేక స్థానం ఉంది.
దళితులు, పేదలు, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలపై కాకా గళం బలంగా వినిపించారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేశారు. పెద్దపల్లి ప్రాంత అభివృద్ధికి కాకా విశేష సేవలు చేశారు. కాకా రాజకీయ వారసత్వాన్ని ఆయన వారసులు కొనసాగిస్తున్నారు.