
Atlee: సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందో స్పష్టత లేదు.. అసలు బాక్సాఫీస్ వద్దకు ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. కానీ డైరెక్టర్ అట్లీ మాత్రం అప్పుడే ఆస్కార్ వేదికపైకి వెళ్లి తమిళంలో స్పీచ్ ఇచ్చేస్తానంటూ పగటి కలలు కంటున్నాడని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మస్త్ ఫైర్ అవుతున్నారు. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో ‘రాకా’ మూవీని ఉద్దేశించి అట్లీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లతో పాటు స్వయంగా అల్లు అర్జున్ అభిమానులే అట్లీని ఆడేసుకుంటున్నారు. ఒకప్పుడు భారతీయ సినిమాకు ఆస్కార్ అనేది ఎండమావి లాంటిది. కానీ ఎస్.ఎస్.రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. అయితే జక్కన్న ఎప్పుడూ అవార్డుల కోసమో, రికార్డుల కోసమో పరుగులు పెట్టలేదు. కథను నమ్ముకుని, ప్రేక్షకుడికి పైసా వసూల్ అనుభూతిని ఇవ్వడమే టార్గెట్‌గా పనిచేశారు. దీంతో ఆస్కార్ పురస్కారం ఆయన సినిమాను వెతుక్కుంటూ వచ్చింది. ఆ సక్సె్స్ ఇచ్చిన జోష్‌తోనే ఇప్పుడు మహేష్ బాబుతో ‘వారణాసి’ని అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. కానీ అట్లీ మాత్రం అసలు కథను గాలికొదిలేసి, ఆస్కారే టార్గెట్ అంటూ భారీ డైలాగులు పేల్చడం ఇండస్ట్రీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో అట్లీ మాట్లాడుతూ.. “‘రాకా’తో ఆస్కార్ సాధించి, ఆ అంతర్జాతీయ వేదికపై తమిళంలో మాట్లాడి మన సంస్కృతి గొప్పతనాన్ని చాటుతాను. ఒకవేళ ‘రాకా’తో అది సాధ్యం కాకపోయినా.. నా తర్వాతి చిత్రాలతోనైనా ఆస్కార్ కల నెరవేరేవరకు విశ్రమించను” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ బయటకు రాగానే సోషల్ మీడియాలో ట్రోల్స్ వరద స్టార్ట్ అయ్యింది. “డైరెక్టర్ పెద్ద కలలు కనడం మంచిదే.. కానీ అది చేతల్లో కనిపించాలి తప్ప ఇలా మీడియా ముందు ప్రగల్భాలు పలకడం కాదు” అంటూ సినీ ప్రియులు చురకలు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులైతే.. “ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంది నీ తీరు! ముందు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తావో డేట్ చెప్పు గురూ.. ఆ తర్వాత ఆస్కార్ ముచ్చట్లు చూసుకోవచ్చు” అంటూ ఏకిపారేస్తున్నారు. హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవతార్’ తరహాలో అత్యంత అధునాతనమైన ‘మోషన్ క్యాప్చర్’ సాంకేతికతతో ‘రాకా’ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ సుమారు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోందని ప్రచారం జరుగుతుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఏకంగా 37 మంది నటుల హావభావాలను మోషన్ క్యాప్చర్ చేసి చిత్రీకరిస్తుండటంతో ఇప్పటికే ఈ సినిమా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ అరుదైన మైలురాయి ఇచ్చిన ఉత్సాహమో లేక అతి విశ్వాసమో తెలియదు కానీ.. అట్లీ మాత్రం బాక్సాఫీస్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా నేరుగా అకాడమీ అవార్డుల వైపు కన్నేశాడు. కొందరు సినీ ప్రియులు ఆయన లక్ష్యాన్ని సమర్థిస్తున్నప్పటికీ, మెజారిటీ ప్రేక్షకులు మాత్రం దర్శకుడికి ఇంతటి ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని హెచ్చరిస్తున్నారు. సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియకముందే అట్లీ చేస్తున్న ఈ హడావుడి చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.