Reading Time: < 1 minute

ప్రజా చైతన్యానికి వేదిక బహుజన బతుకమ్మ.. ‘ఎన్నెల్లో ఎన్నెల్లో ఎన్నెలాలో..’ గీతావిష్కరణలో వక్తలు

Caption of Image.
  • గ్రామీణ సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా సాంగ్

హైదరాబాద్, వెలుగు: బతుకమ్మ పండుగ కేవలం ఉత్సవానికే పరిమితం కాకుండా ప్రజా చైతన్యానికి వేదికగా నిలవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక గీతావిష్కరణ కార్యక్రమం ఆదివారం బంజారాహిల్స్‌‌‌‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌‌‌‌లో ఘనంగా జరిగింది. ప్రొఫెసర్ కస్తూరి లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ప్రొఫెసర్ మనోజ ముఖ్యఅతిథిగా విచ్చేసి గీతాన్ని ఆవిష్కరించారు.

కామ్రేడ్ మిత్ర రాసిన ‘ఎన్నెల్లో ఎన్నెల్లో ఎన్నెలాలో..’ అనే గీతాన్ని అరుణోదయ విమలక్క తన బృందంతో కలిసి పాడారు. ప్రొఫెసర్ కొల్లాపురం విమల ఈ పాట నేపథ్యాన్ని విశ్లేషిస్తూ.. గ్రామీణ ఉపాధి, వ్యవసాయ రంగంలోని సంక్షోభం, నిరుద్యోగం, పర్యావరణ పరిరక్షణ వంటి సమకాలీన సమస్యలను పాటలో పొందుపరిచినట్టు చెప్పారు.

ప్రజల జీవన సమస్యలను కళారూపాల ద్వారా జనంలోకి తీసుకెళ్లేందుకే 15 ఏండ్లుగా బహుజన బతుకమ్మ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బహుజన బతుకమ్మ ప్రచార కార్యక్రమాలు ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతాయని వెల్లడించారు. ఈ ప్రజా సాంస్కృతిక ఉద్యమంలో విద్యావంతులు, మహిళలు, యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

ఈ సభలో ప్రొఫెసర్లు వినయ్ బాబు, భగవంతు రెడ్డి, కొండా నాగేశ్వర్, అరుణోదయ నాయకులు మల్సూర్, రమేష్, అనిత, రాకేష్, కమిటీ సభ్యులు నాగిరెడ్డి, డప్పు భాస్కర్, శ్రీనివాస్ మోత్కూరి, పాలడుగు శ్రీనివాస్, గిరి తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.