
కృష్షుడి అవతారం ముగియబోతోంది.. యదువంశం నాశనం కాబోతోంది.మీరు తొందరగా ద్వారకా నగరాన్ని విడిచి పెట్టాలి”అని కృష్ణుడు అన్న మాట ఉద్దవుడి చెవిలో పడింది. ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి “కృష్ణా! మేం నీతో కలిసి ఆడుకున్నాం.. పాడుకున్నాం.. అన్నం తిన్నాం, సంతోషంగా గడిపాం. ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతోంది. అంటే నేను తట్టుకోలేక పోతున్నాను.
నువ్వు లేకుండా నేను ఉండలేను. కాబట్టి. నా మనసు శాంతించేవిధంగా, నిరంతరం నీ ధ్యాసలో మునిగేవిధంగా నాకేదైనా ఉపదేశం చెయ్యి” అని కోరతాడు ఉద్దవుడు. అప్పుడు కృష్ణుడు చేసిన అద్భుతమైన ఉపదేశం.. కేవలం ఉద్దవుడి కోసమే కాదు.. ఈ లోకం మొత్తాన్ని ఉద్దేశించి చేసినది. ఉద్దవుడిని అడ్డు పెట్టి చేసిన ఆ ప్రసంగమే కృష్ణుడి చివరి ప్రసంగం. దీని తర్వాత కృష్ణుడు మళ్లీ మాట్లాడలేదు. ఇవి మనం అందరం తెలుసుకుని జీవితంలో పాటించాల్సిన విషయాలు.
ఉద్దవా! నేటి నుంచి ఏడోరాత్రికి కలియుగం ప్రవేశిస్తుంది. ఈ ఏడు రోజుల్లోగా ద్వారకను సముద్రం ముంచెత్తుతుంది. ద్వారకలో ఉన్న వాళ్లందరూ చనిపోతారు. ద్వారక సముద్ర గర్భంలోకి వెళ్లిపోతుంది. తర్వాత కలియుగం ప్రవేశిస్తుంది. ప్రవేశించగానే మనుషుల్లో రెండు లక్షణాలు బయలుదేరతాయి. ఒకటి విపరీతమైన కోపం, రెండోది అనంతమైన కోరికలు ఎవరూ తమ తప్పుని తాము తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు.
ప్రతి ఒక్కరికీ కోపమే. ప్రతివాడికీ కోరికలే! కోపం, కోరికలతో తిరగడం వల్ల వ్యాధులు పెరుగుతాయి. దీంతో ఆయుష్షు తగ్గిపోతుంది. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు.ఆచారాలను విడిచిపెట్టే పూజలు చేయడానికి ప్రజలు ఇష్టపడతారు. వేదం, యజ్ఞం లాంటివాటిని మర్చిపోతారు. కేవలం కోరికలు తీరాలనే ఆశతో పుణ్యక్షేత్రాలు తిరగడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.
ఎవరి మనసుని వాళ్లు సంస్కరించుకోవడానికే, పూజలు వచ్చాయని, తక్కువ తిని.. శరీరాన్ని నిలబెట్టుకోవడానికే ఉపవాసం వచ్చిందని గుర్తుంచుకో! అయితే, కలియుగంలో మనుషులు తిండికి, ఇంద్రియాలకు బానిసలవుతారు. ఈశ్వరుడు ఒక్కడే అయినా.. ఈ విషయంలోనూ భేదం చూస్తారు.
దోచుకునేది రాజులే!
ప్రజలను పాలించే రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు.. ఎవరికీ పాండిత్యం.. యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఎలా సంపాదించామన్నది కాకుండా, ఎంత సంపాదించామనేదే ప్రధానం అవుతుంది. ఐశ్వర్యం ఉన్నవాళ్లే పండితులు!
►ALSO READ | జ్యోతిష్యం: కర్కాటకరాశిలో గురు మంగళయోగం ఎఫెక్ట్.. నాలుగు రాశుల వారి కష్టాలు పరార్..
భగవంతుడి పాదాలను పట్టుకొని ముక్తి పొందిన మహాపురుషులు ఎందరో ఉంటారు. వాళ్లు తిరుగాడిన ఆశ్రమాలూ ఎన్నో ఉంటాయి. అయితే, కలియుగంలో అంతా గుళ్ల చుట్టూ తిరిగేవాళ్లే. కానీ, ఇలాంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాలకు ఎవరూ వెళ్లరు. అలాంటి ఆశ్రమాలకు వెళ్లాలి. అలాంటి మహా పురుషుల్ని సేవించాలి. కానీ, అక్కడకు వెళ్లకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే కోరికలు సులువుగా తీరగలవు అని ఆలోచిస్తారు. కేవలం కోరికల మూటతో గుళ్ల చుట్టూ తిరిగితే ఎలాంటి ఫలితమూ ఉండదు.
ఇది గుర్తించుకో
ఉద్దవా! ఇంద్రియాల వల్ల కలిగే సుఖమంతా డొల్ల. ఇది మనిషిని పాడు చేయడానికే వచ్చిందని గుర్తు పెట్టుకో. ఇక ఈ యుగం నుంచి దాటాలని అనుకుంటే.. ఇక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్లిపో. ఈశ్వర నామం విడిచిపెట్టకు.. మౌనం.. ఇంద్రియ నిగ్రహం.. జపం.. మంత్రం.. తపస్సు లాంటివి ఎవరైతే పాటించడం మొదలు పెడతారో వాళ్లు మెట్లెక్కడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల నీకు ఇంద్రియాలకు లొంగని స్థితిని కలిగిస్తాను.
ఆశ్రమాలన్నింటిలో గృహస్థాశ్రమం ముఖ్యం. గృహస్థాశ్రమంలో వేదం చెప్పిన ఇంద్రియ సుఖం ధర్మబద్ధమయినది. వేదాల్లో చెప్పినట్టుగా గృహస్థాశ్రమంలో నువ్వు ఇంద్రియ సుఖాన్ని అనుభవించొచ్చు. కానీ, సుఖంలా కనపడుతున్నది సుఖం కాదనే నిజాన్ని తెలుసుకోగలగాలి. అది తెలుసుకోవడానికే గృహస్థాశ్రమం! ఇది తెలుసుకోలేనివాళ్లు. ఇంద్రియ నిగ్రహం కోల్పోతారు. గృహస్థాశ్రమంలో ధర్మాలను ఆచరిస్తూ.. ఇంద్రియాలకు లొంగనివాళ్లకు మాత్రమే ముక్తి లభిస్తుంది.
ప్రతి గుండెలో పరమాత్మ
సాత్త్వికమైన నా మూర్తి విగ్రహాన్ని ఇంట్లో పెట్టి పూలు వేయాలి. నువ్వు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నాడని అనుకుంటావు. పూలను స్వీకరిస్తున్నాడని భావిస్తావు. దీని వల్ల నీలో ఉండే అహంకారాన్ని ఆ మూర్తి మెల్లిగా తినేస్తుంది. ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం మొదలుపెడతావు. మనసు నిశ్చలంగా మారుతుంది. కొన్నాళ్లకి ప్రతి జీవి గుండెలోనూ పరమాత్మే ఉన్నాడనే సత్యాన్ని గ్రహిస్తావు.అప్పుడు ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు.
పరమాత్మను అనేక రూపాల్లో దర్శిస్తావు. జీవిలో అనంతమై ఉన్న ఈశ్వరుడిని చూస్తూ ఉండగా.. వాడి ప్రాణవాయువు శరీరం నుంచి వెళ్లిపోతుంది. వాడు నన్నే చూస్తూ వెళ్లిపోతాడు. కాబట్టి వాడు నాలో చేరిపోతాడు. కాబట్టి ఉద్ధవా… నువ్వు ఈ పని మొదలుపెట్టు. కలియుగం వచ్చేస్తోంది. బదరికాశ్రమమునకు చేరిపో’ అంటాడు కృష్ణుడు. అలా ఉద్ధవుడు బదరికాశ్రమమునకు వెళ్లిపోగానే, కృష్ణుడు బలరాముడు తన అవతారాన్ని చాలిస్తారు. కలియుగం మొదలవుతుంది.