Reading Time: < 1 minute

సిద్దిపేటలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట

Caption of Image.

సిద్దిపేట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా సిద్దిపేట పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ‘సేవా సంకల్ప యాత్ర’ పేరుతో బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించగా.. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

ప్రధాని మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నాయకులు ‘సేవా జ్యోతి యాత్ర’ నిర్వహించారు. ర్యాలీ కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ నాయకులు మోదీ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే బీజేపీ నాయకులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

మోదీ ప్లెక్సీ దహనానికి మహిళల యత్నం

ర్యాలీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. మోదీ ప్లెక్సీని దహనం చేసేందుకు వారు ప్రయత్నించగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆందోళనకు ప్రయత్నించిన మహిళలను అక్కడి నుంచి తరలించారు.

కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తోపులాట నేపథ్యంలో పోలీసులు ఇరువర్గాలకు చెందిన పలువురిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సిద్దిపేటలో ఒకే సమయంలో బీజేపీ ర్యాలీ, కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
 

©️ VIL Media Pvt Ltd.